పచ్చని పంటలపై నత్తల దాడి.. తలలు పట్టుకుంటున్న గోదావరి జిల్లా రైతులు..

పచ్చని పంటలపై నత్తల దాడి.. తలలు పట్టుకుంటున్న గోదావరి జిల్లా రైతులు..


ఇప్పటివరకు పంటల పై దోమలు దాడి చేయడం పురుగులు దాడి చేయడం చూసాం …కానీ నత్తలు దాడి చేయడం ఎప్పుడైనా చూశారా… ఉభయ గోదావరి జిల్లాలలో పంటలు పై ఆఫ్రికా జాతి నత్తలు దాడి చేస్తున్నాయి.ఈ నత్తల దాడిలో పంటలు పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి.దీంతో రైతులకు కంటి మీద కునుకు ఉండటం లేదు.లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పంట చేతికి అందే సమయానికి నత్తలు తినేయడం తో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వీటి నివారణ సాధ్యం కాక ఉద్యానవన శాస్త్రవేత్తలను ఆశ్రయించారు రైతులు. ఆఫ్రికా నత్తలుగా పేర్కొనే ఇవి ఇక్కడి పంటలకు మరణశాసనం రాస్తున్నాయి. వందలు, వేల సంఖ్యలో ఈ నత్తలు పొలాల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. గడ్డి, ఆకులు, లేత మొక్కలు అంటూ తేడా లేకుండా అన్నింటినీ తినేస్తు న్నాయి. ప్రధానంగా నిమ్మ, కోకో, పామాయిల్, బొప్పాయి, జామ తోటల్లో చెట్టు కాండాలను పట్టుకుని వాటిలోని రసాన్ని పీల్చేస్తున్నాయి.

ఈ నత్తల బెడద ఉభయ గోదావరి జిల్లాల్లో తాజాగా వెలుగుచూసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఉద్యాన వర్సీటీకి ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పెంట్లమ్మ ఆడవి ప్రాంతం సమీపంలోని వ్యవసాయ భూముల్లో ఈ ఆఫ్రికా జాతి నత్తలు తిష్టవేశాయి. ఆవపాడు, నల్లజర్ల, ప్రకాశరావు, పాలెం, ముసళ్లగుంట, సింగరాజపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా ఉద్యాన పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఈ తోటలకు ఆఫ్రికా నత్తల బెడద అధికంగా ఉంది. చెట్ల కాండాలను పట్టుకుని దాని రసాన్ని తాగేస్తున్నాయి. మొక్కల ఆకులు, చిగురులను కూడా ఇవి వదలడం లేదు. ఆకులను పశు వులు మేసినట్లు మేసేస్తున్నాయి. దీంతో మొక్కలు ఎండి పోయి చనిపోతుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

మూడు నెలల క్రితం అక్కడక్కడ ఈ నత్తలు కనిపించాయి. మొదట్లో రైతులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే కొద్ది రోజు ల్లోనే వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. తీవ్రతను గుర్తించిన రైతులు వాటిని ఏరి తగలబెట్టారు. అయినా పూర్తి స్థాయిలో వీటి నివారణ జరగలేదు. పురుగు మందులు పిచికారి చేసైనా వాటిని అదుపు చేయలేకపోయారు.

ఇవి కూడా చదవండి

ఆఫ్రికా జాతి నత్త మొదటిగా కేరళలో కనిపించింది. అక్కడ ఉన్న వక్క తోటలను, ఇతర ఉద్యాన పంటలను దెబ్బతీసింది. అక్కడి రైతులు గుర్తించేలోపే తీవ్ర నష్టం వాటిల్లింది. నల్లజర్ల మండలంలో కొంత మంది రైతులు వక్క సాగు చేపట్టినట్లు సమాచారం. ఇందుకోసం వక్క మొక్కలను కేరళ నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ మొక్కలతో పాటే ఈ ఆఫ్రికా జాతి నత్తలు, వాటి గుడ్లు ఇక్కడికి వచ్చి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నత్తల బెడద తీవ్రం కావడంతో రైతులు వ్యవసాయ శాఖ అధి కారులను ఆశ్రయించారు. దాంతో ఉద్యాన యూనివర్శిటీ శాస్త్రవేత్తలు, కేవీకే శాస్త్రవేత్తల బృందం నత్తలు దాడి చేస్తున్న తోటలను పరిశీలించింది. ఇటీవల పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడ మండలం రేగువలస గ్రామంలో బొప్పాయి తోటల పై ఈ నత్తలు దాడి చేశాయి.

నత్త పురుగు జాతికి చెందినది కాదు. అందువల్ల పురుగు మందులు పిచికారి చేసినా ప్రయోజనం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కీటక జాతి కావడం వల్ల వీటికి కీటక నాశన మందులు వాడాలని రైతులకు సూచిస్తున్నారు. కాఫర్ సల్ఫేట్, ఐరన్ సల్ఫేట్ మిశ్రమాన్ని నీటితో కలిపి చెట్టుపై పిచికారి చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక లీటరు నీటికి 15 గ్రాముల కాపర్ సల్ఫేట్, రెండు గ్రాముల ఐరన్ సల్ఫేట్ పిచికారి చేయడంతో నివారణ సాధ్యమవుతుందని వివరించారు. ఇలా చేయడం వల్ల 30 శాతం నత్తలు తక్షణమే చనిపోతాయని, 70 శాతం నత్తలు రెండురోజుల్లో చనిపోతాయని సూచించారు. ఉప్పు ద్రావణం చల్లడం ద్వారా కూడా చనిపోతాయని, అయితే మొక్కలకు ఉప్పు ద్రావణ తీవ్రత ఎక్కువగా పడితే మొక్కలు కూడా చనిపోయే ప్రమాదం ఉందన్నారు.

ఆఫ్రికా నత్తల సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంటుంది. ప్రస్తుతం గంగురేగువలస, ఆవపాడులో ఉన్న నత్తల జీవిత కాలం 5 నుంచి ఆరేళ్లు ఉంటుంది. ఇది ద్విలింగ జాతికి చెందినది కావడంతో రెండేళ్ల వయస్సు లోనే సంతానోత్పత్తి ప్రారంభిస్తుంది. నెలకు 100 గుడ్లు పెడుతుంది. ఏటా 1000 నుంచి 1200 గుడ్లు పెడుతోంది. జూలై నుంచి ఫిబ్రవరి వరకు సంతానోత్పతికి అనువైన సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నత్తల నివారణ సామూహికంగా చేపటాలని శాస్త్రవేత్తలు సూచిస్తు న్నారు. ఒక్క రైతే నివారణ చర్యలు చేపడితో పక్క తోటలోకి ఇవి వెళ్లిపో తాయని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *