Gold Price Hike: వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి పెరుగుతున్న డిమాండ్.. అందుబాటులో అదిరే కలెక్షన్స్..

Gold Price Hike: వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి పెరుగుతున్న డిమాండ్.. అందుబాటులో అదిరే కలెక్షన్స్..


గోల్డ్‌ రేట్‌ రోజుకో కొత్త రికార్డులను బ్రేక్ చేస్తోంది. సామాన్యులు, మధ్య తరగతి వాళ్లకే కాదు ఓ మోస్తరు ఆదాయమున్న వారికి కూడా అందకుండా దూసుకెళ్తోంది. మన దేశంలో పెళ్లిళ్లతో పాటు శుభకార్యాల అన్నింటిలోనూ బంగారం కొనుగోలు చేయడం అనేది తప్పనిసరి. ఇలాంటి సమయంలో తులం బంగారం ధర ఏకంగా లక్ష 15 వేలు దాటడంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది కష్టంగా మారింది. బంగారంపై పెట్టుబడులు ఎక్కువ కావడం.. గోల్డ్ రేట్ పెరుగుదలకు కారణమవుతోంది. అయితే రాబోయే రోజుల్లో గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయగలమా అనే స్థాయికి చేరుతోంది. ఈ క్రమంలో పసిడి ప్రియులు ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారీ నగలను కొనుగోలు చేయడం ఇప్పటికే చాలా వరకు తగ్గించారు. రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ గోల్డ్, హాలో గోల్డ్ ఆభరణాలు, లైట్‌ వెయిట్ డిజైన్లకు పసిడి ప్రియులు షిఫ్ట్ అవుతున్నారు. ఈ మార్కెట్ 2024లోనే రూ.84 వేల కోట్లకు పెరిగింది. వన్-గ్రామ్ గోల్డ్ డిమాండ్ 2019 నుంచి 2024 మధ్య కాలంలోనే 300 శాతానికి పెరిగిందంటనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డుకు చేరడంతో గోల్డ్ లోన్లలోనూ భారీ పెరుగుదల కనిపిసిస్తోంది. కొత్తగా బంగారం కొనకుండా.. కుటుంబాలు తమ దగ్గర ఉన్న నగలను తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటున్నాయి. ఈ లోన్ల మొత్తం 454 శాతానికి పెరిగింది. అలాగే పాత బంగారం మార్పిడి కూడా రోజు రోజుకూ పెరిగింది. పాత బంగారాన్ని ఇచ్చి కొత్తది తీసుకోవడం 2019లో కేవలం 20 శాతంగా ఉండేది. అయితే ప్రస్తుతం 40 నుంచి 45 శాతానికి పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న వారి విషయానికి వస్తే.. ప్రతిరోజూ ధరించడానికి వీలైన, తక్కువ ధరకు లభించే స్టైలిష్ నగలనే ఇష్టపడుతున్నారు. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు మాత్రమే కొనుగోలుదారులు 22 క్యారెట్‌, 24 క్యారెట్‌ బంగారు ఆభరణాలను కొంటున్నారు. ఇతర సందర్భాల్లో అయితే తేలికపాటి డిజైన్లకే పరిమితమవుతున్నారు. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో తేలికపాటి ఆభరణాల వాడకం 45 శాతానికి చేరింది. ఆన్‌లైన్ జ్యువెలరీ ప్లాట్‌ఫామ్‌ల్లో కూడా అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తే వ్యాపారులు కూడా మారాల్సిన అవసరం కనిపిస్తోంది. చిన్న నగల దుకాణాలు కొత్త డిమాండ్లకు తగ్గట్టు మారకపోతే, వాటిలో సగం మూతపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇండియాలో బంగారానికి మార్కెట్ తగ్గకపోయినప్పటికీ.. రూపాంతరం చెందుతోంది. పసిడి ప్రియులు బంగారం విలువను కాపాడుకుంటూనే.. తక్కువ ఖర్చుతో కూడిన మార్గాల్లో ఆభరణాలను ధరించడానికి ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. మరి భవిష్యత్‌లోనైనా బంగారం కొనుగోలుదారులకు అనుకూలంగా పరిస్థితులు మారుతాయా.. లేక ఆల్టర్‌నేట్‌ బంగారం కోనుగోళ్లు ఇదే విధంగా కొనసాగుతాయా అన్నది చూడాలి.

మరిన్ని బిజినెస్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *