H.E. Sultan Ahmed bin Sulayem visits BAPS Hindu Mandir
DP World ఛైర్మన్, CEO హెచ్.ఇ. సుల్తాన్ అహ్మద్ బిన్ సులయేమ్ తమ కుమారుడు ఘనిమ్ బిన్ సులయేమ్తో కలిసి అబుదాబిలోని BAPS హిందూ మందిరాన్ని సందర్శించారు. సుమారు రెండు గంటలపాటు మందిర నిర్మాణం, ఆధ్యాత్మిక అనుభవం, సాంస్కృతిక ప్రత్యేకతను ఆస్వాదించారు. స్వామి బ్రహ్మవిహారిదాస్.. మందిర నిర్మాణానికి బిన్ సులయేమ్ అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. COVID‑19 సమయంలో రాళ్ల రవాణా నుంచి.. మందిర అభివృద్ధి, నిర్వహణలో ఆయన అందించిన మద్దతు చాలా ముఖ్యమైనది అన్నారు. ఈ సందర్భంగా సుల్తాన్ అహ్మద్ బిన్ సులయేమ్ ఏమన్నారో దిగువన తెలుసుకుందాం…
అద్భుత సృష్టిని ప్రత్యక్షంగా చూడటం ఆనందకరం
“ఇక్కడకు వచ్చినందుకు గౌరవంగా ఉంది. ఈ అద్భుత నిర్మాణంలో ఒక చిన్న భాగం కావడం అద్వితీయమైన అనుభూతి. గతంలో పోల్చితే, ఇప్పుడు చూస్తున్నది పూర్తిగా భిన్నంగా ఉంది. స్థల ఎంపిక కూడా ప్రత్యేకంగా ఉంది. ఇదే ఉత్తమ స్థలం అవుతుంది అని మహామహిమ ముందే భావించారు.”
అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు
“ముందు వచ్చినప్పుడు మందిరం ఇంకా పూర్తిగా ఉండలేదు. మట్టి, ఇసుక, తాత్కాలిక ప్లాట్ఫారం మాత్రమే కనిపించేది. 3D ప్రింటెడ్ గోడలు, ప్రత్యేక స్క్రీన్లు, అందమైన శిల్పాలు పెడతామని చెప్పారు. కానీ ఇప్పుడు ఇలా మారిపోతుందని ఊహించలేకపోయాం. ఇప్పుడు పూర్తిగా చూసి నిజంగా ఆశ్చర్యం కలిగింది.”
డిజైన్ అద్భుతం
“ప్రతి అంశం సరిగ్గా సరిపోతుంది. డిజైన్‌లోని వారి శ్రద్ద కనబడుతుంది. సందర్శకులు కేవలం స్వాగతం పొందరు, సాంస్కృతిక, విద్యా, అవగాహన అనుభవాలను కూడా పొందుతారు. ఈ ప్రయాణం సంస్కృతులను కలిపే వంతెనలా ఉంది.”
కళాత్మక అలంకరణ
“రాజా సులైమాన్ నుంచి భారత ఇతిహాసాలు, లాటిన్ అమెరికా, చైనా వరకు ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది. ఈ కళాత్మకత ఎంతో ప్రత్యేకం.”
సహనం, సామరస్యం, వారసత్వం
“ఇక్కడ ఉన్న సామరస్యం, మమకారం కొత్తది కాదు. ఇది పూర్వీకుల నుంచి వచ్చిన సంప్రదాయమే. ఇక్కడ వివిధ వ్యక్తులు, ముఖ్యంగా భారతీయులు ఎల్లప్పుడూ ఇళ్లల్లో ఉన్నట్టే సౌకర్యంగా ఉంటారు. సమానత్వం, పరస్పర గౌరవం, అందరికి ఒకే స్థానం ఉండటం ఇక్కడి పెద్ద ఆస్తులు.”
“మీ తండ్రి ఎవరు, తాత ఎవరు అనేది ముఖ్యం కాదు. మీరు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం. మీకోసం సొంత గుర్తింపు సంపాదించాలి. మన సంస్కృతిలో అందరికీ సమానంగా ఉండడం, ఒకరిపై ఒకరు గౌరవం చూపడం, చట్టం ముందు సరిగా ఉండటం పెద్ద విషయాలు”
కేవలం నిర్మాణం కాదు, ఆధ్యాత్మిక అనుభవం
“ఈ మందిరం మనసు, హృదయం, ఆత్మకు ఎంతో సంతృప్తి ఇస్తుంది. సందర్శకులు కేవలం భవనాన్ని చూసి వెళ్లరు, ఆధ్యాత్మికతను అనుభవిస్తారు. సేవలో నిబద్ధత చూపుతున్న వారు మాటలు అవసరం లేకుండా పని చేస్తారు. మందిరం ప్రతి సందర్శన కొత్త అనుభవాన్ని ఇస్తుంది. మళ్లీ ఇక్కడికి రావడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.”