అటు దసరా రష్, ఇటు వరదల కారణంగా అడుగడుగునా ఆటంకాలు. దీంతో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వాయిస్: పట్నం…పల్లెకు బయల్దేరింది. బారులు తీరిన బస్సులు. కార్లతో కిటకిటలాడుతున్న జాతీయ రహదారులు. ఎటుచూసినా దసరా పండుగ రష్ కనిపిస్తోంది. సొంత ఊళ్లకు వెళుతున్న వారితో జాతీయ రహదారులు కిటకిటలాడుతున్నాయి. దీనికితోడు వర్షాలువరదలతో జాతీయ రహదారులపై వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు టోల్‌గేట్ల దగ్గర వాహనాలు బారులు తీరి కనిపిస్తున్నాయి.
హైదరాబాద్-విజయవాడ మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. దసరా పండుగకు వరుస సెలవులు రావడంతో, పట్నం నుండి సొంతూర్లకు బయలుదేరుతున్నారు వాహనదారులు. మూసీ వరదల కారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఇక హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకల సంఖ్య భారీగా ఉండడంతో రద్దీ ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ని క్రమబద్ధీకరించారు. మరోవైపు విజయవాడ హైవేపై హయత్‌నగర్‌లో కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఇవి కూడా చదవండి
మరోవైపు భారీ వర్షాల కారణంగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గౌరెల్లి దగ్గర వంతెనపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఇక్కడ వాహన రాకపోకలు నిలిచిపోయాయి. గౌరెల్లి వంతెన దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేసి.. స్థానికులను అప్రమత్తం చేశారు. మరోవైపు వర్షాలకు ఉప్పల్ చౌరస్తా దగ్గర వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో వరంగల్ వెళ్లే వాహనాలు నత్తనడకన సాగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.