తిరుపతి.. ఆధ్యాత్మిక రాజధానే కాదు పొలిటికల్ సెంటర్ కూడా. ఎన్నికలప్పుడే కాదు పొలిటికల్ గా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే నేతల మధ్య ఇప్పుడు ఆధిపత్యపోరు పిక్స్ కు చేరుకుంది. అధికారంలో ఉన్న కూటమి పార్టీల మధ్యనే కాదు మూడు పార్టీల్లోని నేతల మధ్య కూడా మూడు ముక్కలాట కొనసాగుతోంది. టిడిపి, జనసేన, బిజెపి మూడు పార్టీలోనూ ఒక్కో పార్టీలో మూడు గ్రూపులున్నాయి. అధికారం చలాయించే ప్రయత్నంలో ఎవరికి వారు తాము తక్కువ కాదన్నట్లు వ్యవహరిస్తుండడంతో కోల్డ్ వార్ కాస్తా ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ గా మారింది. నామినేటెడ్ పదవుల విషయంలో తిరుపతికి హై కమాండ్ ప్రియారిటి ఇచ్చిన ఇంకా ఏదో ఆశిస్తున్నా నేతలు ఇప్పుడు ఇంచార్జ్ పదవితో పాటు పెత్తనం కోసం పాకులాడుతున్నారు. తిరుపతి ఇన్చార్జిగా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కు వ్యతిరేకంగా టిడిపి నేతలు ఎవరికి వారు గ్రూపులు కట్టి రాజకీయం చేస్తుండడంతో తిరుపతి టిడిపి పరిస్థితి దారుణంగా తయారైంది.
తిరుపతి ఇన్చార్జ్ సుగుణమ్మకు ఏపీ గ్రీనరీ బ్యూటిఫీకేషన్ చైర్మన్ పదవి దక్కగా, తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ కు ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ పదవి, ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి తిరుపతికి చెందిన రుద్రకోటికి ఇచ్చిన టిడిపి హై కమాండ్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా డాలర్స్ దివాకర్ రెడ్డి, శాప్ చైర్మన్ గా రవి నాయుడు, ఏపీ హస్త కళల చైర్మన్ గా పసుపులేటి హరిప్రసాద్ తోపాటు పలు కార్పొరేషన్ లలో డైరెక్టర్ పదవులను తిరుపతికి చెందిన నేతలకు టిడిపి అధిష్టానం చోటు కల్పించింది.
ఇక తిరుపతి ఇంచార్జ్ మార్పు విషయంలో టిడిపి హై కమాండ్ నాన్చుడు ధోరణి అవలంబించడంతో నేతల మధ్య నెలకొన్న అసంతృప్తి తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ దేవస్థానం పాలకమండలి నియామకం సమయంలో రోడ్డున పడింది. తాతయ్యగుంట గంగమ్మ గుడి చైర్మన్ గా తిరుపతి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి గా ఉన్న మహేష్ యాదవ్ ను నియమించడంతో టిడిపి గ్రూపుల్లో ఉన్న ఆధిపత్య పోరు ప్రత్యక్ష ఆరోపణలు విమర్శలతో రోడ్డుఎక్కిన పరిస్థితి తీసుకొచ్చింది. శాప్ చైర్మన్ రవి నాయుడు మద్దతుతో మహేష్ యాదవ్ కు చైర్మన్ పదవి వచ్చిందని ఫైర్ అయిన టిడిపిలోని ఇతర నాయకులు నేరుగా విమర్శలు చేయడంతో క్రమశిక్షణ గల పార్టీలో నేతల మధ్య కొట్లాట మాటల యుద్ధానికి దారి తీసింది.
ఒకవైపు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మరోవైపు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం, ఇంకో వైపు శాప్ చైర్మన్ రవి నాయుడు అనుచర గణం ఇలా ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా, ప్రెస్మీట్ లు పెట్టి వ్యక్తిగత దూషణలు, అవినీతి ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకున్న పరిస్థితి ఏర్పడింది. తిరుపతి టిడిపి ఇన్చార్జిగా ఉన్న సుగుణమ్మను తప్పించి తమకు బాధ్యతలు అప్పగించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేతలు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నా హై కమాండ్ మాత్రం నోరు మొదపని పరిస్థితి ఉంది.
తిరుపతి రాజకీయం తలనొప్పిగా మారిందన్నట్లు గా భావిస్తోంది. తిరుపతి ఇన్చార్జి గా తనే కొనసాగాలని తపన పడుతున్న సుగుణమ్మను తప్పించి తమకు చాన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్న వారిలో జేబీ శ్రీనివాస్, మబ్బు దేవనారాయణ రెడ్డి ఉన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ తిరుపతి నేతలను ఒక్క తాటిపై తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తిరుపతి టిడిపి పెత్తనం తమదే అన్నట్లు ఎవరికి వారు వ్యవహరిస్తుండడంతో టిడిపిలో మూడు ముక్కలాట కొనసాగుతోంది.
ఇక జనసేన లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుతో తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఎన్నికల సమయం నుంచి కయ్యానికి కాలు దువ్వుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పసుపులేటి హరిప్రసాద్ సైతం అటు ఎమ్మెల్యేకు, ఇటు కిరణ్ రాయల్ కు సమాన దూరం పాటిస్తున్నాడంతో జనసేనలో మూడు ముక్కలాట కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు సైతం కొన్ని గ్రూపులను పక్కన పెట్టడంతో జనసేన కేడర్ ను లీడ్ చేయలేక పోతున్నారని ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ సైతం ఆయన తీరుపట్ల అసంతృప్తిగా ఉండడంతో అసమ్మతి వర్గం జనసేనలో హీట్ పుట్టిస్తోంది. జనసేన క్యాడర్ కు నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యత దక్కకపోవడం, ఇందుకు ఎమ్మెల్యే కూడా సహకరించడం లేదని భావిస్తున్న పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఇదే కాకుండా కూటమి నేతలకు ఎమ్మెల్యే పనితీరు రుచించకపోవడంతో టిడిపి, బిజెపిలు కూడా సహకరించని పరిస్థితి నెలకొంది.
మరోవైపు తామేమి తక్కువ కాదనట్లు తిరుపతిలో బిజెపి ప్రత్యేకంగా పనిచేస్తుంది. మూడు పార్టీల భాగస్వామ్యం ఉన్న కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకంగా పనిచేస్తుంది. బిజెపి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉంటే, మరోవైపు టిటిడి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ టీటీడీ అంశాలపై ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇక సామంచి శ్రీనివాస్, భాను ప్రకాష్ వాళ్ళ మధ్య బంధం గతానికి భిన్నంగా ఉండడంతో ఆ ఇద్దరు నేతలకు అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తున్న మరికొందరు నేతలు తమదో లోకం అన్నట్లు ప్రత్యేక వర్గంగా పనిచేస్తున్న పరిస్థితి బీజేపీలనూ కొనసాగుతోంది.
అయితే బిజెపి జిల్లా అధ్యక్షుడిగా తిరుపతికి చెందిన శ్రీనివాస్ తిరుపతిలో పట్టు కోసం తీవ్రంగానే కృషి చేస్తున్న పరిస్థితి ఉండగా.. వైసీపీతో డైరెక్ట్ ఫైట్ చేస్తున్న టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ మాత్రం తిరుపతిలోని బిజెపి నేతల మద్దతు కూడగట్ట లేకపోతున్నారు. దీంతో కమలం పార్టీలోనూ సఖ్యత కనిపించకపోవడంతో మూడు పార్టీల్లోనూ మూడు ముక్కలాట కొనసాగుతోంది. కూటమిలోని మూడు పార్టీల నేతలు కలిసి పని చేసే అవకాశం లేకపోతోంది. ఒకే వేదికపై వచ్చి సఖ్యతగా ఉన్నామని చెప్పే ప్రయత్నం జరగకపోతోంది. దీంతో మూడు హై కమాండ్ లకు తిరుపతి రాజకీయం తలనొప్పిగా మారిపోయింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.