అక్టోబర్ 4న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ పథకానికి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ అని పేరు పెట్టినట్లు సీఎం తెలిపారు. ఒక్కో డ్రైవర్‌కు రూ.15 వేల చొప్పున ప్రతి ఏటా అందిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3.20 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అందులో 2,90,234 మందిని అర్హులుగా గుర్తించామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘ఆటోడ్రైవర్ సేవలో’ పథకం కోసం రూ.435 కోట్ల ఖర్చు చేయనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ సిక్స్ పథకాలు, మేనిఫెస్టో హామీలపై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం చంద్రబాబ ఈ ప్రకటన చేశారు.
‘ఆటోడ్రైవర్ సేవలో..’ పథకం కింద ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ సాయం అందించనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు స్త్రీ శక్తి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లకు ఆర్థికంగా సాయం అందించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది.. స్త్రీ శక్తి పథకం వల్ల నష్టం వాటిల్లుతోందని డ్రైవర్లు విజ్ఞప్తి మేరకు చంద్రబాబు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
పేదల సంక్షేమానికి కూటమి సర్కార్ కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎందరు పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామన్నారు. అప్పట్లో దీపం పథకం కింద 52 లక్షల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, ఇప్పుడు ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఇందు కోసం ఇప్పటి వరకు రూ.1,700 కోట్లు ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. వివిధ పథకాల కింద మహిళలను ధనవంతులుగా చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..