ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన టూరిజం కాన్క్లేవ్-2025” కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, పర్యాటక శాఖమంత్రి జూపల్లి, సహా ఇతర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు 15,279 కోట్ల పెట్టుబడులు, 50 వేల మందికి ఉపాధికి సంబంధించి ఒప్పందాలు జరిగినట్టు వారు తెలిపారు. వీటితో 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, మొత్తం 50,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ఈ ప్రాజెక్టుల్లో 14 పీపీపీ ప్రాజెక్టులు (రూ. 7,081 కోట్లు), 16 ప్రైవేట్ రంగ ప్రాజెక్టులు (రూ.8,198 కోట్లు) ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా అనంతగిరిలో లగ్జరీ వెల్నెస్ రిట్రీట్, వికారాబాద్‌లో తాజ్ సఫారీ, విన్యార్డ్ రిసార్ట్, మూడు అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్లు, రామోజీ ఫిలిం సిటీ రూ. 2,000 కోట్ల విస్తరణ. మొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్కాంటినెంటల్, సెయింట్ రీజిస్, ఒబెరాయ్ హోటల్స్ హైదరాబాద్‌కి రానున్నాయి. 10,000 కొత్త హోటల్ గదులు, థీమ్ పార్కులు, ఫిలిం టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ అభివృద్ధితో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా టూరిజంకు ఒక పాలసీ లేదని.. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చిందని తెలిపారు. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని అభినందిస్తున్నానన్నారు. తెలంగాణలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ సిటీ అని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని.. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతుందని సీఎం అన్నారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి… లాభాలు పొందండని వివిధ సంస్థలకు పిలుపునిచ్చారు. ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్ లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించామని.. శాంతిభద్రతల విషయంలోనూ తెలంగాణ సెఫెస్ట్ ప్లేస్ అని గుర్తుచేశారు. మీ పెట్టుబడులకు ఇక్కడ రక్షణ ఉంటుంది తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.