మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని దుండగుడు ఇంట్లోకి చొరబడి 5 ఏళ్ల చిన్నారిని దారుణంగా హత్య చేశాడు. వరుస దెబ్బలతో ఆ చిన్నారిని మూడు ముక్కలుగా నరికాడు. తల్లిదండ్రులు అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగలేకపోయాడు.. హత్య తర్వాత పారిపోతున్న నిందితుడిని గ్రామస్తులు పట్టుకున్నారు. అతన్ని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకుని నిందితుడిని ఆస్పత్రికి తరలించారు. కుక్షి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో హంతకుడు మృతి చెందాడు.
ధార్ జిల్లాలో ఈ హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటన కుక్షి పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని అలీ గ్రామంలో జరిగింది. ధూళి బేడి అనే ప్రాంతంలో గుర్తు తెలియని నిందితుడు ఒక ఇంట్లోకి చొరబడి 5 ఏళ్ల చిన్నారిని అత్యంత దారుణంగా నరికి చంపాడు. నిందితుడు పదునైన కత్తితో చిన్నారిపై దాడి చేయడంతో ఆ చిన్నారి శరీరం మూడు ముక్కలుగా విడిపోయింది. ఈ సంఘటన గ్రామం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
యువకుడు అపాచీ బైక్‌పై అలీ గ్రామంలోని కలు సింగ్ ఇంటికి వచ్చాడు. అతను ఇంట్లోకి ప్రవేశించి మంచం మీద కూర్చున్నాడు. అతను ఎవరు, ఎందుకు వచ్చాడని కలు సింగ్, అతని భార్య ప్రశ్నించగా, అతను అకస్మాత్తుగా ఇంట్లో వేలాడుతున్న పదునైన కత్తిని తీసుకుని హంగామా సృష్టించాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో కలు సింగ్, అతని భార్య తోపాటు ఐదేళ్ల కుమారుడు వికాస్ అక్కడే ఉన్నారు. వారి ఇద్దరు కుమార్తెలు బయట ఆడుకుంటున్నారు. యువకుడి చేతిలోని కత్తిని చూసి, కలు సింగ్ భయంతో బయటకు పరిగెత్తాడు.
అయితే, అతని భార్య స్పందించేలోపే, నిందితుడు అమాయక బాలుడు వికాస్‌పై క్రూరంగా కత్తితో పదే పదే దాడి చేశాడు. పిల్లాడి మెడ మొండెం నుండి తెగిపోయింది. శరీరం ముక్కలు.. ముక్కలుగా నరికేశాడు. పిల్లాడి తల్లి భయంతో కేకలు వేస్తూ.. సంఘటన స్థలంలోనే చూస్తూ ఉండిపోయింది. నిందితుడు తన బైక్‌ను వదిలి పారిపోయేందుకు ప్రయత్నించాడు. మహిళ కేకలు విన్న సమీపంలోని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పారిపోతున్న నిందితుడిని స్థానికులు పట్టుకుని, చెట్టుకు కట్టేసి, తీవ్రంగా కొట్టారు. తరువాత, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని కుక్షి సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం నుండి నిందితుడి బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడి కుటుంబంతో పోలీసులు అండగా నిలుస్తున్నారని ధార్ పోలీసు సూపరింటెండెంట్ మయాంక్ అవస్థి తెలిపారు.
కాగా, చిన్నారిని చంపి పారిపోతుండగా గ్రామస్తులు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. కుక్షి సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నిందితుడు జోబాట్‌లోని బాగ్డి గ్రామానికి చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. అతని మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే గత మూడు, నాలుగు రోజులుగా ఇంటి నుండి వెళ్లి కనిపించకుండా పోయాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..