ప్రపంచంలోని అత్యంత మురికి నదుల్లో మూసీ నది ఒకటి. ఒకప్పుడు ఇది కూడా గోదావరి, కృష్ణా నదుల్లాగే ఎప్పుడూ నిండుగా నీటితో ఉండేది. కానీ కాలక్రమంలో అది మురుగు నీరు ప్రవహించే ఓ పిల్ల కాలువలా మారిపోయింది. కానీ నది ఎగువ ఉన్న ప్రాంతాల్లో కురిస్తున్న వర్షాలు ముంచెత్తితే మూసీ ఉప్పొంగుతోంది. మహానగారాన్నే ముంచేస్తోంది.
కృష్ణానదికి ఉపనదిగా ఉన్న మూసీ.. వికారాబాద్‌లోని అనంతగిరి కొండల్లో పుడుతుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల గుండా ప్రవహిస్తూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. అయితే చానాళ్ళకు పశ్చిమ హైదరాబాద్‌ను మూసీ వరద ముంచెత్తింది. అత్తాపూర్ మొదలుకుని , పురానాపూల్.. మీదుగా చాదర్‌ఘాట్ దగ్గర మూసీ మహోగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. దీంతో హైదరాబాద్-విజయవాడ మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసీ ఉధృతితో పరివాహక ప్రాంతాల్లో హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగింది. చాదర్‌ఘాట్, మలక్‌పేట్, మూసారాంబాగ్ దగ్గర వరదల్లో చిక్కుకున్న బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేశారు.
కొన్ని దశాబ్దాల తర్వాత ఈస్థాయిలో మూసీ ఉప్పొంగడానికి కారణం అనంతగిరి కొండలున్న వికారాబాద్‌తో పాటు పరిగి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటమే అని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ముప్పుతప్పలేదు. ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది మూసీ ప్రవాహం. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ ఇంతలా ఉగ్రరూపం దాల్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మూసీ నదికి వరద పోటెత్తింది. వికారాబాద్ జిల్లాలో శుక్రవారం (సెప్టెంబర్ 26) ఒక్కరోజే 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, తాండూరు, పరిగి నుంచి మూసీకి పోటెత్తుతోంది వరద. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల వరద కూడా దీనికి తోడైంది. నలువైపుల నుంచి వస్తున్న వరద నీటితో మూసీ మహోగ్రరూపం దాల్చింది. పై నుంచి వరదతో జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీలోకి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో పురానాపూల్, MG బస్ స్టేషన్, చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో మూసీ ఉగ్రరూపం దాల్చింది
మూసీ నది మహోగ్రరూపం దాల్చడానికి అసలు కారణం ఎగువన కురుస్తున్న వర్షాలు. వికారాబాద్ జిల్లాలో15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్, తాండూరు, పరిగి నుంచి మూసీకి వరద పోటెత్తుతోంది. అక్కడ నుంచి మూసీ ప్రవాహం హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి భారీగా చేరుకుంటోంది. జంట జలాశయాల నుంచి మూసీలోకి నీటిని విడుదల చేయడంతో పురానాపూల్ దగ్గర మూసీ మహోగ్రరూపం దాల్చింది. పురానాపూల్ శివాలయం, శ్మశాన వాటిక, బాపు ఘాట్ నీట మునిగింది. అక్కడ నుంచి MGBS దగ్గరికి ఉధృతంగా కొనసాగుతోంది వరద. ముసారాబాగ్ బ్రిడ్జి దగ్గర 10 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. పాత బ్రిడ్జి నీటిలో పూర్తిగా మునిగింది. బ్రిడ్జి పరిసర కాలనీలు నీటమునిగాయి. ముసారాంబాగ్ నుంచి వరద మూసీ ప్రవాహం నల్గొండ వైపు కొనసాగుతోంది.
ఛాదర్‌ఘాట్ బ్రిడ్జి వద్ద వరద పోటెత్తి భయంకరంగా పెరిగి, రోడ్లు, కాలీనలు నీట మునిగిపోయాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) దగ్గర ప్రవాహం భయానకంగా మారింది. వేల మంది ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరకునేందుకు ఎదురుచూస్తుండగా.. ఒక్కసారిగా బస్టాండ్ లోకి నీరు వచ్చేసింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై బస్సులు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. రాత్రంతా ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది రెస్క్యూ పనులు కొనసాగిస్తూ.. తాళ్ల సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు.
నగరీకరణతో జంట నగరాల్లో భవనాల నిర్మాణం పెరిగింది. ఇళ్లలో నుంచి వచ్చే నీరు మూసీలో కలుస్తోంది. 2022లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నదుల్లో మూసీ 22వ స్థానంలో ఉంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సంకల్పించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూసీ పొడవునా 55 కిలోమీటర్ల పరిధిలో 10,600 కట్టడాలను గుర్తించింది. అనంతగిరి కొండల నుంచి వరద ప్రవాహానికి తోడు, జంటజలాశయాలు నిండటంతో మూసీని ఈ స్థాయిలో వరద ముంచెత్తిందని అధికారులు తెలిపారు.
మూసీ ప్రమాద స్థాయిలో ప్రవహించడం కొత్తేం కాదు. కానీ ఎంజీబీఎస్‌నే ముంచెత్తేంత వరద మాత్రం ఇదే తొలిసారి. 1908 సెప్టెంబరు 28 వరదలు సృష్టించిన బీభత్సంతో ఇలాంటి విపత్తులను నివారించేందుకు జంట జలాశయాలను అందుబాటులోకి తెచ్చారు. దీంతో మూసీ వరదల ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. 117 ఏళ్ల క్రితం 1908లో హైదరాబాద్ నగరాన్ని మూసీ ముంచెత్తింది. 1908 సెప్టెంబరు 28న మూసీ ప్రళయం సృష్టించింది. నిజాం హయాంలోనే నగరం అతలాకుతలం అయ్యింది. అప్పటి వరదల్లో 15 వేల మంది మరణించారు. 1912లో నిజాం చొరవతో సిటీ ఇంప్రూవ్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. మూసీ వరదను నియంత్రించేందుకు 1920లో ఉస్మాన్‌సాగర్ ఆనకట్ట నిర్మాణం చేపట్టారు. 1927లో హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ నిర్మించారు. అయితే, ఇప్పుడు మూసీ అక్రమణలు, అర్బనైజేషన్ కారణంగా సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. ఆక్రమణలతో కుచించుకుపోయిన మూసీ మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జాగ్రత్తపడకపోతే మహానగరాన్ని ముంచేస్తానని భయపెడుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..