ఆంధ్రప్రదేశ్‌లో మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత ప్రయాణ సదుపాయం ‘స్త్రీశక్తి పథకం’ మరింత విస్తరించబోతోంది. ఇప్పటివరకు సాధారణ సర్వీసుల్లో మాత్రమే అమలవుతున్న ఈ పథకాన్ని, త్వరలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. తాడిపత్రి ఆర్టీసీ డిపోను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల మధ్య నడిచే ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మొత్తం 1,050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే సేవలోకి తీసుకురాబోతున్నామని చెప్పారు. వీటిలో 300 తిరుపతికి, మిగిలిన 700 బస్సులు రాష్ట్రంలోని 13 ప్రాంతాలకు కేటాయించనున్నట్లు వివరించారు. స్త్రీశక్తి పథకం ప్రారంభమైనప్పటి నుండి ప్రతిరోజూ లక్షలాది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని బస్టాండ్లలో తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సీట్లు వంటి సదుపాయాలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.
తాడిపత్రి బస్టాండు తనిఖీ సమయంలో పైకప్పు సమస్యలు గమనించిన ఆయన.. వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే కడప గ్యారేజీ, బస్టాండును ఆకస్మికంగా పరిశీలించి, సిబ్బందితో సమస్యలను తెలుసుకున్నారు. కడప బస్టాండు ప్రాంగణంలో రూ.1.30 కోట్ల వ్యయంతో సిమెంటు రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు.
వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యలను అధిగమించడానికి ఈ కొత్త వసతులను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉచిత ప్రయాణాన్ని వినియోగించే మహిళలు ఎంతో క్రమశిక్షణతో ఉంటున్నారని అభినందించారు. ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు, మెరుగైన మౌలిక వసతులతో రాష్ట్ర రవాణా సేవలను మరింత అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.