పిల్లలకు పాలు పట్టించాలి. పాలు తాగితేనే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ పాలే ఓ పసిబిడ్డ ప్రాణాలు తీశాయి. చెన్నైలో పాలు తాగుతూ నెలన్నర వయసున్న శిశువు ఊపిరాడక మరణించింది. సూర్య (26) చెన్నై సమీపంలోని పూనమల్లి వెల్లవేడు ప్రాంతానికి చెందినవాడు. అతను ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అతని భార్య చారులత (23), ఈ దంపతులకు 46 రోజుల క్రితం ఒక మగబిడ్డ పుట్టాడు. సాధారణంగా రాత్రిపూట బిడ్డకు పాలు ఇచ్చేవారు. అలానే శుక్రవారం రాత్రిపూట బిడ్డకు పాలు ఇచ్చి నిద్రపుచ్చారు. కానీ, ఆ బిడ్డ మరుసటి రోజు ఉదయం నిద్రలేవలేదు.
ఏంటీ బిడ్డ నిద్ర లేవడం లేదని ఎత్తుకొని నిద్రలేపే ప్రయత్నం చేసినా బిడ్డ కదలకపోవడంతో అంతా షాక్ అయ్యారు. వెంటనే పూనమల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ శిశువును పరీక్షించిన వైద్యులు అప్పటికే బిడ్డ చనిపోయాడని చెప్పారు. పాలు తాగుతుండగా ఊపిరాడక చిన్నారి చనిపోయి ఉండవచ్చని వైద్యులు తెలిపారు. దీంతో ఆ దంపతులు ఆసుపత్రిలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై వెల్లవేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి ఊపిరాడక చనిపోయిందా లేక మరేదైనా కారణమా అని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని శవపరీక్ష కోసం తిరువళ్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి పంపారు.
పాలు తాగుతూ ఊపిరాడక చిన్నారి మృతి చెందడం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిన్నర వయసున్న చిన్నారి మరుగుతున్న పాలలో పడి మృతి చెందిన సంఘటన గురించి తెలిసిందే. పాఠశాలలో పనిచేసే తన తల్లితో కలిసి వచ్చిన ఆ చిన్నారి వంటగదిలోకి వెళ్లింది. పెద్ద పాత్రలో మరుగుతున్న పాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆ పాత్ర దగ్గరకు వచ్చిన ఆ చిన్నారి జారిపడి మరుగుతున్న పాల పాత్రలో పడిపోయింది. ఈ ఘటనలో ఆ చిన్నారి విషాదకరంగా మరణించింది. ఈ ఘటనలతో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి