Asia Cup 2025: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య జరగనుంది. సెప్టెంబర్ 28న జరగనున్న ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు కొన్ని గాయాల బెడద ఎదురైంది. భారత జట్టులోని పలువురు ఆటగాళ్లకు స్వల్ప గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు ఆటగాళ్లకు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గాయాలయ్యాయి. ఈ విషయంపై మ్యాచ్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమాచారం ఇవ్వగా, ఆ తర్వాత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మరిన్ని వివరాలు వెల్లడించారు.
రిపోర్ట్‌ల ప్రకారం, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా శ్రీలంక ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన తర్వాత మైదానం వీడాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదు. అభిషేక్ శర్మ చేతికి నొప్పి రావడంతో, శ్రీలంక ఇన్నింగ్స్ మధ్యలోనే మైదానాన్ని వదిలి వెళ్ళాడు. ఇక యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు హామ్‌స్ట్రింగ్ స్ట్రెయిన్ (కండరాల నరాల లాగడం) అయ్యినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ గాయాలు ఫైనల్ మ్యాచ్‌కు ముందు టీమిండియా శిబిరంలో కొంత ఆందోళనను కలిగించాయి.
శ్రీలంకతో మ్యాచ్ అనంతరం ఆటగాళ్ల గాయాలపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. “మా ఆటగాళ్లకు మ్యాచ్ సమయంలో కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ, పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్‌కు ముందు మాకు ఒక రోజు విశ్రాంతి ఉంది. ఆ ఒక్క రోజులో వారు పూర్తిగా కోలుకుంటారు అని మేము ఆశిస్తున్నాం. ఫైనల్‌కు పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగుతారు” అని సూర్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.
భారత్-శ్రీలంక మ్యాచ్ తర్వాత బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు కూడా గాయపడిన ఆటగాళ్ల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మోర్కెల్ ప్రకారం, ఈ ఆటగాళ్లకు సమస్యలు వచ్చాయి. అభిషేక్ శర్మ ఇప్పటికే ఆ గాయం నుండి కోలుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నాడు. ఫైనల్‌కు ముందు అతను కూడా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటాడని మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, తిలక్ వర్మ గాయం గురించి మాత్రం మోర్కెల్ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
మొత్తంగా చూస్తే, శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లకు కొన్ని గాయాలైనప్పటికీ, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఈ ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తారని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో ఈ ఆటగాళ్లు ఆడటం టీమిండియాకు చాలా ముఖ్యం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..