తెలంగాణలో పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు భారీగా రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బుసాని వెంకటేశ్వరరావు కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే ఆధారంగా 42% రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయి.
ఆర్టికల్స్ 40, 243D, 243Tతో పాటు డైరెక్టివ్ ప్రిన్సిపిల్స్ ప్రకారం ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే అసెంబ్లీలో ఈ బిల్లకు ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం అమలులోకి రాబోయే ఈ రిజర్వేషన్లతో తెలంగాణ దేశంలోనే తొలిసారి బీసీలకు పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పించిన రాష్ట్రంగా నిలిచింది.
ఈ నిర్ణయంతో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బీసీ వర్గాల ప్రాధాన్యం మరింత బలపడనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి