ఖాకీలా గుండెను సైతం కదిలించిన హృదయవిదారక ఘటన ఇది.. మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన పసిపిల్లల వరుస హత్యల మిస్టరీని ఛేదించిన పోలీసులే షాక్ అయ్యారు. ఆ పిల్లల ప్రాణాలు మింగేసింది కన్న తల్లే అనే చేదు నిజం తేల్చి కటకటాల్లోకి పంపారు. పిల్లల హత్యలకు డెత్ డైరీ డిసైడ్ చేసుకున్న ఆ కసాయి తల్లి ఇద్దరు కన్న కొడుకుల అతి కిరాతకంగా చంపి వారి హత్యల వెనుక ఓ పిట్టకథ అల్లి అందరిని తప్పుదారి పట్టించింది. కానీ చిన్న క్లూ సహాయంతో ఆ కసాయి తల్లిని పట్టేసిన పోలీసులు కటకటాల్లోకి పంపారు.
కన్నబిడ్డ అరికాళ్లకు ముల్లు గుచ్చుకుంటే చాలు ఏ తల్లికైనా గుండె తల్లడిల్లిపోతుంది. కానీ ఈ కసాయి తల్లికి మనసేలా వచ్చిందో ఏమో.. పేగు తెంచుకుని పుట్టిన కన్న బిడ్డలను వరుసగా ఇద్దరు కొడుకులకు హతమార్చి పిట్టకథలతో జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేసింది. కానీ ఖాకీల కళ్ళు ఆ తల్లి నేరాన్ని పసిగట్టాయి. కన్న తల్లే హంతకురాలని తేల్చి కటకటాల్లోకి పంపారు. మొదటి బాలుడిది సాధారణ మరణం అని అంతా భావించినప్పటికీ, రెండో కొడుకు హత్య విచారణలో అసలు కథ బయటపడింది..
ఈ దారుణ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో జరిగింది. శిరీష-ఉపేందర్ దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. వీరి చిన్న కొడుకు రెండు నెలల నేహాల్ అనే బాలుడు జనవరి 15వ తేదీన చనిపోయాడు..ఇంటి సమీపంలోని నీళ్ల సంపులో విగతజీవిగా పడి మృతి చెందాడు. ఆ బాలుడు మరణం ప్రమాదవశాత్తు జరిగిందని అంతా భావించారు. అంతటితో కథ ముగిసింది.
అయితే పెద్ద కొడుకు మనీష్ కుమార్ పై నెల రోజుల క్రితం హత్యాయత్నం జరిగింది. ఇంట్లో తల్లి పక్కనే నిద్రిస్తున్న బాలుడి మెడపై కత్తితో దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన కొడుకుపై హత్యాయత్నం చేశారని హడావుడి చేసిన తల్లి ఆసుపత్రిలో చేర్చడంతో అతనికి తిరిగి ప్రాణం పోసుకుంది. మనీష్ మృత్యుంజయుడు అయ్యాడని అంతా భావించారు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న మనీష్ కుమార్ను మృత్యువు మరోసారి వెంటాడింది. సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి మెడకు తాడుతో బిగించి హత్య చేశారు. చిన్న కొడుకు చనిపోయిన ఎనిమిది నెలల వ్యవధిలోనే పెద్ద కొడుకు కూడా చనిపోవడంతో ఆ కుటుంబంతో పాటు ఊరంతా తల్లడిల్లిపోయింది. పెద్ద కొడుకు మనీష్ ను ఎవరు హత్య చేశారో తెలియక, ఊరంతా భయానక వాతావరణం ఏర్పడింది. బోరున విలపిస్తున్న ఆ తల్లిని చూసి ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అని గుండెలు బాదుకున్నారు.
పోలీసుల నిఘానేత్రం బయటపెట్టిన అసలు నిజాలు తెలిసి ఊరంతా షాక్ అయ్యారు. ఆ పసిపిల్లలపై పడి గుండెలు బాదుకున్న కన్నతల్లే హంతకురాలని పోలీసులు తేల్చారు. భర్త తాగుడుకు బానిసై, వివాహేతర సంబంధాలతో తనను చిత్రహింసలు పెడుతుండడంతో శిరీష ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. తన మరణంకంటే ముందు తన ముగ్గురు బిడ్డలను కడతేర్చి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది . తన డెత్ డైరీలో మొదట ముగ్గురు పిల్లలను చంపేయాలని భావించుకుంది. ఒక్కో పిల్లవాడికి ఒక్క టైపు స్కెచ్ వేసిన తల్లి, ఇప్పటికే ఇద్దరిని హత్య చేసింది. మరో పిల్లవాడికి కూడా ప్లాన్ చేసుకుంది. విచారణలో భాగంగా కన్నతల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు కథ బయట పెట్టారు.. అ కసాయి తల్లిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..