హిందూ సంప్రదాయంలో నవరాత్రి ఒక ప్రధాన పండుగ. ఈ తొమ్మిది రోజులు భక్తులు భక్తి శ్రద్ధలతో భగవతి దేవిని పూజిస్తారు. సాధారణంగా చాలా హిందూ ఇళ్లలో ఈ సమయంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం వంటి మాంసాహారాలు నిషేధం. అయితే, దేశంలో కొన్ని ప్రదేశాలలో హిందువులు నవరాత్రి సమయంలో దేవతకు చేపలు, మటన్ వండి నైవేద్యం సమర్పిస్తారు.
కుమార్తె హోదాలో అమ్మవారు
బెంగాలీ సంస్కృతిలో చేపలు, మటన్ కు ప్రత్యేక స్థానం ఉంది. వివాహాలు, శుభ సందర్భాలలో వీటిని శుభప్రదంగా భావిస్తారు. పూజారి శుభ్ బంద్యోపాధ్యాయ ప్రకారం, బెంగాలీ సంస్కృతిలో దుర్గాదేవిని కుమార్తెగా భావిస్తారు. ఒక కుమార్తె తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, ఆమెకు ఇష్టమైన రుచికరమైన చేపలు, మటన్ వంటకాలు తినిపించడం సాంప్రదాయం. దీని కారణంగానే ఈ నైవేద్యం సమర్పిస్తారు. దుర్గాదేవితో పాటు ఇతర యోగినిలను కూడా పూజిస్తారు.
నిరామిష్ మాంగ్షో రహస్యం
నవరాత్రి సమయంలో సాత్విక ఆహారం (ఉల్లి, వెల్లుల్లి లేని ఆహారం) తీసుకోవడం ఆచారం. అయితే, బెంగాల్ లోని కొన్ని శక్తి దేవాలయాలలో, ముఖ్యంగా కాళీ పూజ సమయంలో, మాంసం, చేపలు నైవేద్యంగా పెట్టే ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఈ వంటకాలను ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీనిని ‘నిరామిష్ మాంగ్షో’ (నిరామిష్ మటన్) అంటారు. కాబట్టి దుర్గా పూజ సమయంలో చేపలు, మటన్ వండటం రుచి కోసం కాదు. బెంగాలీ సంస్కృతిలో ఇదొక లోతైన, గౌరవప్రదమైన సంప్రదాయం.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం బెంగాలీ సంస్కృతికి సంబంధించిన ప్రాంతీయ, ప్రత్యేక ఆచారం గురించి వివరిస్తుంది. ఈ పద్ధతులు అన్ని హిందూ సంప్రదాయాలకు, నవరాత్రి ఆచారాలకు వర్తించవు. ఈ వివరాలు సాధారణ జ్ఞానం కోసం, మీడియా నివేదికల ఆధారంగా అందించాం. సాంస్కృతిక విషయాలలో తుది నిర్ణయం మీ వ్యక్తిగత విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది.