బెంగళూరు, సెప్టెంబర్ 26: బెంగళూరులో ఓ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ చీరల షాపులో దొంగతనం చేసింది. రూ. 91,500 విలువైన చీరలను దొంగిలించిందని ఆ షాపు యజమాని ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా కాలితో తన్నాడు. మహిళ ఆర్తనాదాలు చేస్తున్నా.. ఏ మాత్రం పట్టించుకోకుండా బూతులు తిడుతూ కాలితో ఆమె కడుపులో, గుండెలపై తన్నాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించడంతో చీరల షాపు యజమాని, అతని సిబ్బందిని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
బెంగళూరులోని చిక్‌పేట్‌లోని కరూర్ వైశ్యా బ్యాంక్ సమీపంలో ఉమేద్ రామ్ అనే వ్యక్తి మాయ సిల్క్ చీరల షాపు నడుపుతున్నాడు. సెప్టెంబర్ 20న తన షాప్ నుంచి 61 చీరల కట్టను ఓ మహిళ దొంగిలించిందని ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఆమె ప్యాక్ చేసిన కట్టను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందని ఫిర్యాదులో తెలిపాడు. యజమాని ఫిర్యాదు మేరకు సిటీ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ మరుసటి రోజు అదే ప్రాంతానికి దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ తిరిగి రావడంతో.. చీరల షాపు యజమాని, అతని సిబ్బంది ఆమెపై దారుణంగా దాడి చేశారు. ఆమెను రోడ్డుపైకి లాక్కెళ్లి ప్రైవేట్ పార్ట్‌లపై పదే పదే కొట్టాడం, చెంపదెబ్బ కొట్టడం, తన్నడం వంటి వీడియో దృశ్యాలు స్థానికులు రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి
అయితే తొలుత పోలీసులు దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఆమె దొంగిలించిన చీరల్లో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ వీడియో దృశ్యాలు బయటకు రావడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ, ఆరోపణలు చేస్తూ, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పు చేస్తే పోలీసులకు అప్పగించాలి. అంతేగానీ ఇలా నడిరోడ్డుపై మహిళను దారుణంగా కొట్టడం ఏంటని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. ఇక నిరసనల నేపథ్యంలో బెంగళూరు వెస్ట్ డివిజన్ పోలీసులు దాడికి పాల్పడినందుకు యజమాని, అతడి షాపు సిబ్బందిని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో సిటీ మార్కెట్ పోలీసుల నిర్లక్ష వ్యవహారం కూడా భాగమేనని, దర్యాప్తు అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీనియర్ అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.