
తెలంగాణకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. మూడు రోజులపాటు బీఅలర్ట్ అంటోంది వాతావరణశాఖ. 16 జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షసూచనతో పాటు 0 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురవొచ్చని హెచ్చరికలు ఇచ్చింది. అటు తెలంగాణపై వాయుగుండం తీవ్ర ప్రభావం చూపే చాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.
తెలంగాణలోని 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అటు 17 జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్, జోగులాంబ గద్వాలజిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు ప్రకటించింది. కాగా, అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు నిజామాబాద్, భద్రాచలం, ములుగు, పరిగి, కామారెడ్డిలో జోరువాన దంచికొడుతోంది.