అమరావతి, సెప్టెంబర్ 26: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, రేపు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం, విశాఖలోని తుపాను హెచ్చరికలు జారీ చేశాయి.
తీరం వెంట గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప జనాలను బయటకు రావొద్దంటూ ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్ప పీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలోని భవనాలు వద్ద ఉండరాదని, సోమవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
తెలంగాణలోనూ నేడు, రేపు కుండపోత
మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఈరోజు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రాగల నాలుగు రోజులు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.