ములుగు జిల్లాలో విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు కోతులు.. మరో వైపు వీధీ కుక్కల దాడిలో జనం బేజారై పోతున్నారు. మనుషులపై పడి రక్కి గాయపరుస్తున్నాయి కోతులు. ములుగు జిల్లాలో వానర గుంపు బీభత్సం సృష్టించాయి. ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తిపై దాడిచేసి అతని చెవిని కొరికి తెంచుకుపోయాయి. కోతుల దాడిలో ఎడమ చెవిని కోల్పోయిన ఆ బాధితులు తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు.
ఈ విచిత్ర సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ గ్రామంలో జరిగింది. రాజు (38) అనే రైతు తన ఇంటి ముందు పని చేసుకుంటున్నాడు. ఈ సమయంలో గుంపుగా వచ్చిన కోతులను తరిమే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా దాడిచేసిన కోతులు బీభత్సం సృష్టించాయి. రాజుపై పడి రక్కేశాయి.
అంతేకాదు రాజు ఎడమ చెవిని కొరికి, ఆ చెవును తెంచుకుపోయాయి. కోతుల దాడిలో చెవి తెగిపోయి తీవ్ర రక్తస్రావం అవుతుండగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రాజు ప్రస్తుతం ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామస్తులు ఈ కోతుల బెడద నుండి తమకు విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..