భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. భారత వాయుసేనలోకి (IAF) కు 97 తేజస్ మార్క్-1A ఫైటర్ జెట్లు అందబోతున్నాయి. భారత వైమానిక దళం కోసం 97 తేలికపాటి పోరాట విమానాలు (LCA) Mk1A (తేజస్) యుద్ధ విమానాలను తయారు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ గురువారం (సెప్టెంబర్ 25) హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) కు ఆర్డర్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం పన్నులు మినహాయించి రూ. 62,370 కోట్లకు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ 97 LCA Mk1A విమానాలలో 68 సింగిల్-సీటర్ ఫైటర్ జెట్‌లు, 29 డబుల్-సీటర్ ట్రైనర్ విమానాలు ఉన్నాయి. ఈ విమానాల డెలివరీలు 2027-28లో ప్రారంభమవుతాయి. ఆరు సంవత్సరాలలో పూర్తిస్థాయి ఫైటర్ జెట్లను అదించేందుకు హిందూస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్‌తో రక్షణ శాఖ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అవి 64% కంటే ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోనున్నాయి. 67 కొత్త స్వదేశీ భాగాలను కలిగి ఉంటాయి. ఇది ఆత్మనిర్భర్ భారత్ చొరవను ప్రోత్సహించే దిశగా ఒక ప్రధాన అడుగు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) ఈ ప్రధాన కొనుగోలుకు ఆమోదం తెలిపంది. దాదాపు ఒక నెల తర్వాత ఈ ఒప్పందంపై సంతకం చేశారు. ప్రభుత్వ యాజమాన్యంలోని ఏరోస్పేస్ దిగ్గజంతో ఇది రెండవ ఒప్పందం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి తేజస్ ఫైటర్ జెట్ కోసం రెండవ ఆర్డర్‌ను అందుకుంది. ఫిబ్రవరి 2021లో, కేంద్ర ప్రభుత్వం HALతో 83 మార్క్ 1A జెట్‌ల కోసం ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ రూ. 46,898 కోట్లు, డెలివరీ 2028కి షెడ్యూల్ చేయడం జరిగింది.
భారత వైమానిక దళానికి చెందిన MiG-21 యుద్ధ విమానాలను సింగిల్ ఇంజిన్ Mk-1A భర్తీ చేస్తుందని రక్షణ శాఖ భావిస్తోంది. IAF తన ఫైటర్ స్క్వాడ్రన్ బలం అధికారికంగా ఆమోదించిన 42 నుండి 31కి పడిపోయింది. ఈ యుద్ధ విమానాలను చేర్చుకోవాలని రక్షణ శాఖ చూస్తోంది. 62 సంవత్సరాల సేవలందించిన MiG-21 విమానం సెప్టెంబర్ 26, 2025న విరమణ చేయనుంది. ఇది 1971 యుద్ధం, కార్గిల్ సహా అనేక ఇతర ప్రధాన మిషన్లలో కీలక పాత్ర పోషించింది. కాగా, HAL ఇటీవల LCA-Mk1A (తేజస్ Mk1A) కోసం మూడవ JE-404 ఇంజిన్‌ను అందుకుంది. త్వరలో మరొక ఇంజిన్‌ను అందుకోవాలని ఆశిస్తోంది. LCA-Mk1A వెర్షన్ మరింత అధునాతన పోరాట ఏవియానిక్స్, ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..