
జగిత్యాల జిల్లా మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు తల్లిదండ్రుల సమావేశాన్ని విజయవంతం చేయాలని కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఈనెల 26వ తేదీన కళాశాలలో జరగనున్న పేరెంట్స్ మీటింగ్‌కు తప్పనిసరిగా హాజరుకావాలని కోరుతూ.. విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఆహ్వానం అందించారు. ఇప్పటివరకు నిర్వహించిన సమావేశాలకు తల్లిదండ్రుల హాజరు చాలా తక్కువగా ఉండటంతో ఈసారి ప్రత్యేకమైన విధానాన్ని అవలంబించారు. మండలంలోని ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గ్రామాల వారీగా తిరుగుతూ ప్రతి విద్యార్థి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులకు బొట్టు పెట్టి ఆహ్వాన పత్రికను అందజేశారు. వర్షం ఆటంకం కలిగించినప్పటికీ రెయిన్‌కోట్లు ధరించి విద్యార్థుల ఇళ్లకు చేరి ఆహ్వానం అందించడం వారి కట్టుబాటు, పట్టుదలని చూపించింది.
విద్యార్థుల చదువులో ఉన్నతి, సమస్యలు, భవిష్యత్ ప్రణాళికల గురించి తల్లిదండ్రులతో చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శివరామకృష్ణ చెప్పారు. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రుల భాగస్వామ్యం చాలా ముఖ్యమన్నారు.
ఈ వినూత్న ప్రయత్నానికి తల్లిదండ్రులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ సమావేశానికి వస్తాం అని తల్లిదండ్రులు హామీ ఇస్తున్నారు. అధ్యాపకుల ఈ కృషి ఇప్పుడు గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడంలో ఈ ప్రయత్నం మల్యాల మండలానికి ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..