దక్షిణకొరియాలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులు ఆందోళన చేపట్టారు. సియోల్‌లోని LG హెడ్‌క్వార్టర్స్ ట్విన్ టవర్స్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతోన్న వందలమంది కార్మికులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఘటన అనంతరం ఎల్జీ పాలిమర్స్ నుంచి ఎలాంటి సాయం అందలేదని బాధితులు పేర్కొన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా ఎల్జీ పాలిమర్స్ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బాధితులకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
కాగా.. 2020 మే 7న విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్‌లీకై 15మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఇంకా చాలామంది చనిపోయారనేది ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది. అయితే, ఆ 15మంది మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇచ్చింది అప్పటి వైసీపీ ప్రభుత్వం అంతేకాదు, ఆస్పత్రిపాలైన వారికి కూడా సాయం అందించింది. ఆరోజు 6 వందల మందికి పైగా అస్వస్థతకు గురికాగా.. దాదాపు 20వేల మందిపై ఆ ప్రభావం పడింది. ఇప్పటికీ వందలాది మంది అనారోగ్యంతో బాధపడుతూ ట్రీట్మెంట్కి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగి ఐదేళ్లు దాటిపోతున్నా.. ఇప్పటివరకూ కంపెనీ ఆదుకోలేదంటున్నారు బాధితులు..
వీడియో చూడండి..
ఐదేళ్లుగా కంపెనీని అడిగిఅడిగీ అలసిపోయి.. దక్షిణకొరియాలోని LG హెడ్‌క్వార్టర్స్ ముందు నిరసనకు దిగామంటున్నారు బాధితులు.. సియోల్‌లోని LG హెడ్‌క్వార్టర్స్ ట్విన్ టవర్స్ ముందు ఆందోళన చేపట్టిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్.. బాధితులకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులకు అండగా పలు అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు నిలిచాయి. విశాఖ నుంచి సియోల్ తీసుకెళ్లి.. LG హెడ్‌క్వార్టర్స్ ముందు నిరసన తెలిపేలా చేశారు.. అంతకుముందే మూడు ప్రధాన డిమాండ్లతో LG నాయకత్వానికి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతిపత్రం సమర్పించింది.
వెంటనే నష్టపరిహారం చెల్లించి.. మళ్లీ ఇలాంటి దుర్ఘటన జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్. 38 కుటుంబాలతోపాటు 186మంది బాధితులు రికార్డుల్లోకి ఎక్కలేదని.. వీళ్లందరికీ సాయం అందించాలంటున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక.. సీఎం చంద్రబాబు చొరవతో 120 కోట్ల రూపాయల సాయం అందించేందుకు ముందుకొచ్చింది ఎల్జీ పాలిమర్స్ సంస్థ.. ఇప్పటికే, 60 కోట్ల రూపాయలను అధికార యంత్రాంగం ద్వారా బాధితుల అకౌంట్లలో జమచేసినట్టు చెబుతున్నారు. 6వేల 121 బాధిత కుటుంబాలకు సాయం అందనుందని గత సెప్టెంబర్‌లో అప్పటి కలెక్టర్ ప్రకటించారు. మిగతా 60కోట్లతో ప్రభావిత గ్రామాల్లో ఉపాధి కల్పన, ఆస్పత్రి నిర్మాణం, తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పింది ఎల్జీ పాలిమర్స్… కొద్దిరోజులక్రితమే వాటర్ప్లాంట్ని కూడా ప్రారంభించారు..
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..