Asia Cup 2025: ఆసియా కప్ 2025 లో భారత క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు ట్రాస్ సమయంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ జేకర్ అలీ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ప్రెజెంటర్ రవిశాస్త్రి వద్దకు వెళ్ళినట్లుగా కనిపించింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరగగా, ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఇప్పుడు బయటపడింది.
పదే పదే సూర్యకుమార్ పై వివాదాలు.. కారణాలు
ఈ వీడియో పెద్ద చర్చకు దారితీసింది, ఎందుకంటే ఇది కేవలం ఒక్క సంఘటన కాదు. గ్రూప్ స్టేజ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ ఇవ్వలేదని, టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్ పాక్ ఆటగాడు సల్మాన్ అలీ ఆగా తో షేక్ హ్యాండ్ ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిని పాకిస్తాన్ తమకు జరిగిన అవమానంగా భావించింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మ్యాచ్ రెఫరీకి అధికారిక ఫిర్యాదు కూడా చేసింది. అయితే, దీనిపై సూర్యకుమార్ యాదవ్ స్పందిస్తూ, “కొన్ని విషయాలు క్రీడా స్ఫూర్తికి మించినవి” అని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంతో బంగ్లాదేశ్ కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే వార్త మరింత త్వరగా వ్యాపించింది.
వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఏమిటి?
సోషల్ మీడియాలో వ్యాపించిన ఈ ఫేక్ వీడియో వెనుక ఉన్న నిజం ఇప్పుడు బయటపడింది. వాస్తవానికి సూర్యకుమార్ యాదవ్, జేకర్ అలీ ఇద్దరూ షేక్ హ్యాండ్ చేసుకున్నారు. మరొక వీడియోలో టాస్ గెలిచిన తర్వాత జేకర్ అలీ తన నిర్ణయాన్ని చెప్పి వెళ్తుండగా, సూర్యకుమార్ యాదవ్ రవిశాస్త్రి వద్దకు వస్తుండగా వారిద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకుంటూ షేక్ హ్యాండ్ చేసుకున్నారు. టాస్ జరిగిన తర్వాత కొంత సమయం తీసుకుని వారు కలుసుకున్నట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది.
No handshake between India and Bangladesh players. #AsiaCup2025 pic.twitter.com/gNNvtAjk3t
— MEER YASIR🇵🇸 (@meer_yasi_r) September 24, 2025
దీన్ని బట్టి చూస్తే, మొదటి వీడియోను ఎవరైనా కావాలనే తప్పుడు వాదనలతో వైరల్ చేసి ఉండవచ్చు. సూర్యకుమార్ యాదవ్‌పై ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరగడం ఇది మొదటిసారి కాదు. ఇది ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా, క్రీడా స్ఫూర్తిని కూడా దెబ్బతీస్తుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ లిటన్ దాస్ గాయం కారణంగా ఆడలేకపోయాడు. అతని స్థానంలో జేకర్ అలీ జట్టు పగ్గాలు చేపట్టాడు. జేకర్ అలీ ట్రాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.
No handshake b/w Indian and Bangladeshi captain at the toss! 🤯#INDvBAN pic.twitter.com/sOpVdlTvTv
— عیان 🇵🇸 🍉 (@rouxx_en_y) September 24, 2025
భారత్ తదుపరి మ్యాచ్ ఎప్పుడు?
ఆసియా కప్ 2025లో టీమిండియా తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 26న శ్రీలంకతో ఉంది. అయితే, ఈ మ్యాచ్ కేవలం లాంఛనమే, ఎందుకంటే శ్రీలంక ఇప్పటికే టోర్నమెంట్ నుండి అధికారికంగా నిష్క్రమించింది. టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. భారత్‌తో పాటు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ విజేత రెండో ఫైనలిస్ట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్ రెండూ 2-2 పాయింట్లతో ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..