
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో డేటింగ్ యాప్ మోసం బయటపడింది. ఓ డాక్టర్ డేటింగ్ యాప్ ద్వారా మోసానికి గురయ్యాడు. గ్రీండర్ యాప్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు సదరు డాక్టర్‌పై అఘాయిత్యం చేయబోయాడు. అతడు నిరాకరించడంతో డబ్బులు కోసం బ్లాక్ మెయిల్ చేశాడు. చివరికి చేసేదేమీలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళ్తే..
గ్రీండర్ డేటింగ్ యాప్ ద్వారా సదరు డాక్టర్‌కు ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరూ ఆ యాప్ ద్వారానే తరచూ చాటింగ్ చేశారు. ఇక ఒకానొక సమయంలో ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకుని.. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న ఓయో రూమ్ బుక్ చేసుకున్నారు. ఇక కలుసుకున్న రోజు ఆ యువకుడు డాక్టర్‌పై అత్యాచారం చేయబోయాడు. దానికి డాక్టర్ ప్రతిఘటించడంతో.. అతడిపై కోపంతో దాడి చేశాడు నిందితుడు. అంతేకాదు తనకు డబ్బులు ఇవ్వకుంటే ప్రైవేట్‌గా కలిసిన విషయాన్ని బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో భయపడ్డ డాక్టర్.. అతడికి రూ. 5 వేలు ఇచ్చాడు. అంతటితో ఆగని నిందితుడు డాక్టర్‌ను ఫాలో చేసి.. అతడు పని చేస్తున్న హాస్పిటల్‌కి వెళ్లి న్యూసెన్స్ చేశాడు. మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో గత్యంతరం లేక పోలీసులను ఆశ్రయించాడు వైద్యుడు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.