తిరుపతి, సెప్టెంబర్ 25: తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బ్రహ్మోత్సవాల్లో మెదటి రోజు ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమైంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన బుధవారం రాత్రి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్, ఈవో లు సీఎం చంద్రబాబుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలి వాహన సేవ అందుకున్న మలయప్ప స్వామి పరమపద వైకుంఠనాథుడు అలంకారంలో దర్శనమిచ్చారు.
మరోవైపు ఎగ్జిబిషన్ ను తొలి రోజు టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. తిరుమలలో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శనతో పాటు మీడియా సెంటర్ ను కూడా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తోందన్నారు. తిరుమలలో మీడియా అందిస్తున్న సేవలను అభినందించిన చైర్మన్ శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతికూల అంశాలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామన్నారు. వాటిని సంచలనాత్మకంగా చూపించడం మానుకోవాలని మీడియాకు సూచించారు. స్వామి అనుగ్రహంతో భక్తులందరూ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆనందంగా తిలకించాలని ఆకాంక్షించారు.
ఇక శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు చిన్న శేష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం ఇవ్వనున్నారు. 5 పడగల ఆదిశేషుని వాహనంగా చేసుకుని మాడవీధుల్లో ఊరేగుతున్న మలయప్ప స్వామి. చిన్ని కృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనం. గ్యాలరీలోని భక్తులకు దర్శనం ఇస్తున్న స్వామి వారు. తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు వాహన సేవలు ఉదయం 8 గంటలకే ప్రారంభమైనాయి. చిన్న శేష వాహనంలో శ్రీవారు దర్శనమిచ్చారు. ఇక రాత్రి 7 గంటలకు హంస వాహనం జరగనుంది.
తిరుమలలో సీఎం చంద్ర బాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. అక్కడ ఉప రాష్ట్రపతి తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం తిరుమల నుంచి తిరుపతి చేరుకొని అమరావతికి తిరుగు ప్రయాణం చేయనున్నట్లు సమాచారం.