తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో మెదటి రోజు సాయంత్రం సాయంత్రం 5.43 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభ
మయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం. ముందుగా బంగారు తిరుచ్చి పై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, కంకణ బట్టర్ వేణుగోపాల దీక్షితులు, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన బుధవారం రాత్రి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా సీఎం బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలుకగా సీఎం ధ్వజస్తంభానికి మొక్కుతూ శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామిభాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో లు సీఎం చంద్రబాబుకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఇక శ్రీవారి ఆలయంలోనే 2026 ఏడాది టిటిడి డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు. అనంతరం ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ తో కలిసి సీఎం దంపతులు స్వామి వారి పెద్దశేష వాహన సేవలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, తిరుపతి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టిటిడి బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలి వాహన సేవ అందుకున్న మలయప్ప స్వామి పరమపద వైకుంఠనాథుడు అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప కటాక్షించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) పరమపద వైకుంఠనాధుడు అలంకారంలో తిరుమాడ వీధులలో భక్తులను కటాక్షించారు.
ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు.
ఇక బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు పెద్ద శేష వాహన సేవలో పాల్గొన్న కళాబృందాలు ఆకట్టుకున్నాయి. సప్తగిరి సార్వభౌముని సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పెద్ద శేష వాహనంపై శ్రీనివాసుడు భక్తకోటిని అనుగ్రహిస్తూ మాడవీధులలో ఊరేగగా 19 కళాబృందాలు స్వామివారి సేవలో తరించాయి. తిరుపతికి చెందిన శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన మూడు కళా బృందాలు తమ కళారూపాలతో ఆహుతులను ఆకట్టుకున్నాయి. క్షీరసాగర మధనం రూపకం నయన మనోహరంగా సాగింది.
తమిళనాడుకు చెందిన భరతనాట్యం, మహారాష్ట్ర నుండి గోంధాల్ నృత్యం ప్రదర్శించారు. గూడూరు సాయి నృత్య బృంద అకాడమీకి చెందిన శైలజా కుమారి బృందం ప్రదర్శించిన శ్రీనివాస కళ్యాణ ఘట్టం కనువిందు చేసింది.
అస్సాం రాష్ట్రానికి చెందిన జోయ్ దేవ్ దేఖా బృందం ప్రదర్శించిన బిహూ నృత్యం ఎంతో కమనీయంగా సాగింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రసూన్ బెనర్జీ ప్రదర్శించిన రవీంద్ర నృత్యం ప్రసిద్ధ కవి రవీంద్రనాథ ఠాగూర్ రచించిన నాటకాలు, కవితలు, పాటలు ఆధారంగా రూపొందించిన నృత్య రుపకం, భావ ప్రధానమైన కళారూపకం. బెంగాలీ సాంస్కృతిక కళావైభవానికి అద్దం పట్టే ఈ కళ ఎంతో మనోహరంగా సాగింది.
త్రిపురకు చెందిన రాజ్ మోగ్ దీపపు నృత్యం, కడపకు చెందిన బ్రహ్మయ్య బృందం ప్రదర్శించిన కోలాటం, విశాఖపట్నానికి చెందిన కె.సునీత బృందం ప్రదర్శించిన దైవకోల, తెలంగాణకు చెందిన గౌరవి రెడ్డి బృందం ప్రదర్శించిన దశావతార ఘట్టం భక్తులను మంత్రముగ్ధులను చేసింది, మహారాష్ట్ర కు చెందిన తరుణ శేఖర్ బృందం ప్రదర్శించిన కథక్ నృత్యం, కర్ణాటక రాష్ట్రానికి చెందిన డాక్టర్ దర్శిని మంజునాథ్ ప్రదర్శించిన మోహిని అట్టం నృత్యం, పశ్చిమగోదావరికి చెందిన త్రిమూర్తులు బృందం ప్రదర్శించిన కోలాట నృత్యం, కడపకు చెందిన బాబు బృందం ప్రదర్శించిన డ్రమ్ముల విన్యాసం, హైదరాబాద్ కు చెందిన రేణుక ప్రభాకర్ బృందం ప్రదర్శించిన కాళింగ నృత్యం, కేరళకు చెందిన అభిషేక్ బృందం ప్రదర్శించిన కథాకళి, పుదుచ్చేరికి తిరుమరుగన్ బృందం ప్రదర్శించిన కరఘట్టం, ఎంతో ఉత్సాహభరితంగా నేత్రపర్వంగా సాగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, అస్సాం, త్రిపుర, పాండిచ్చేరి, కేరళ రాష్ట్రాల నుండి 19 కళాబృందాలు 472 మంది కళాకారులు పాల్గొన్నారు.
తిరుమలలో కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శనతో పాటు రామ్ భగీచా-2 లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను కూడా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల వైభవాన్ని ఫల, పుష్ప, ఫోటో ప్రదర్శన ప్రతిబింబిస్తోందన్నారు టిటిడి చైర్మన్. తిరుమలలో రవాణా, క్యూ లైన్ విధానం, అన్నప్రసాదం, లడ్డు ప్రసాదం పంపిణీ తదితర విశేషాలను తెలియజేసే అరుదైన ఫోటోలు ఆకర్షణగా నిలుస్తున్నాయని అన్నారు. ఆయుర్వేద, అటవీ శాఖ, శిల్పకళాశాల స్టాల్స్‌ను ఆయన అభినందించగా, టీటీడీ పబ్లికేషన్స్, అగరబత్తి స్టాల్‌ను కూడా సందర్శించారు.
గార్డెన్ విభాగం రూపొందించిన ఘటోత్కచ, బకాసుర, సురస, ద్రౌపది స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్ప అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చైర్మన్ కొనియాడారు. అదేవిధంగా, బెంగళూరుకు చెందిన కళాకారిణి గౌరి రూపొందించిన సైకత శిల్పంలో ఆనందనిలయ విమాన వెంకటేశ్వరుని మోసుకెళ్తున్న మహాగరుడ రూపకల్పన విశేషంగా ఆకట్టుకుంటోందని పేర్కొన్నారు.
తిరుమలలో మీడియా అందిస్తున్న సేవలను అభినందించిన చైర్మన్ శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవాన్ని స్ఫూర్తిదాయకంగా ప్రచారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రతికూల అంశాలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకురావాలని, వాటికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామన్నారు. వాటిని సంచలనాత్మకంగా చూపించడం మానుకోవాలని మీడియాకు సూచించారు. స్వామి అనుగ్రహంతో భక్తులందరూ వార్షిక బ్రహ్మోత్సవాలను ఆనందంగా తిలకించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకీదేవి, శాంతారామ్, నరేష్ కుమార్, జంగా కృష్ణమూర్తి, ఆశీకారులు పాల్గొన్నారు.