Asia Cup Controversy: దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్ తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య మొదలైన వివాదం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఆటగాళ్ల వ్యవహారం ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వరకు చేరింది. పాకిస్తాన్ ఆటగాళ్ల అనుచిత ప్రవర్తనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది.
హరీస్ రౌఫ్, ఫర్హాన్‌లపై బీసీసీఐ ఫిర్యాదు
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్, బ్యాట్స్‌మన్ సాహిబ్జాదా ఫర్హాన్ లపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. 21 సెప్టెంబర్ నాడు జరిగిన ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ అభ్యంతరకరమైన, రెచ్చగొట్టే సైగలు చేశారని బీసీసీఐ ఆరోపించింది.
బౌండరీ లైన్ వద్ద హరీస్ రౌఫ్ విమానం కూలిపోతున్నట్టు సైగ చేయడం వివాదానికి దారితీసింది. భారత ఆర్మీ చర్యలను ఎగతాళి చేయడానికే రౌఫ్ ఈ సైగ చేశాడని భావిస్తున్నారు. అంతేకాకుండా, బౌలింగ్ చేస్తున్నప్పుడు అతను శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలను తిట్టారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, భారత యువ బ్యాట్స్‌మెన్ తమ బ్యాట్‌తో దీనికి సమాధానం ఇచ్చారు.
సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ కొట్టిన తర్వాత బ్యాట్‌ను మెషిన్ గన్ లాగా పట్టుకొని గాల్లో కాల్చినట్టుగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా విమర్శలకు దారితీసింది. ఇది కేవలం ఒక క్షణికావేశంలో చేసిన సెలబ్రేషన్ అని, ఇతరులు ఎలా తీసుకుంటారో తనకు పట్టదని ఫర్హాన్ తరువాత చెప్పడం కూడా దుమారం రేపింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా.. రౌఫ్, ఫర్హాన్‌లు ఐసీసీ ప్రవర్తనా నియమావళి కింద విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారిపై ఆరోపణలు రుజువైతే, ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం.
సూర్యకుమార్ యాదవ్‌పై పీసీబీ రివర్స్ ఫైర్
బీసీసీఐ ఫిర్యాదుకు ప్రతిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) కూడా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌పై విజయం సాధించిన తర్వాత, సూర్యకుమార్ తమ జట్టు విజయాన్ని భారత సైన్యానికి, పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇవ్వడం పొలిటికల్ స్టేట్మెంట్ అని పీసీబీ ఆరోపించింది. అయితే, పీసీబీ ఈ ఫిర్యాదును సరైన సమయ పరిమితిలో చేసిందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
వివాదానికి దారితీసిన వీడియో
ఈ మొత్తం వివాదాన్ని మరింత పెంచడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వి చేసిన పని కూడా కారణమైంది. ఆయన సోషల్ మీడియాలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గోల్ సెలబ్రేషన్ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో రొనాల్డో కూడా విమాన ప్రమాదాన్ని సూచించేలా సైగ చేస్తున్నట్లు చూపించారు. ఇది రౌఫ్‌ను సమర్థించే ప్రయత్నంగా భావిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..