
ఏపీ ప్రజలకు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆరు రోజుల పాటు ఏపీవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 26, 27 తేదీల్లో కోస్తాలో చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. గురువారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. అది రేపటికి వాయుగుండంగా మారే అవకాశముందన్నారు వాతావరణ శాఖ అధికారులు. పశ్చిమ దిశగా ప్రయాణించనున్న వాయుగుండం.. ఈనెల 27 నాటికి దక్షిణ ఒడిస్సా, ఉత్తర కోస్తా తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, పారావతీపురం మన్యం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, ఏలూరు, వెస్ట్ గోదావరి, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 26, 27 తేదీల్లో చాలా చోట్ల భారీ నుంచి అతిభారి వర్షాలు పడతాయంది.
26న ఏలూరు, వెస్ట్ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. కోస్తాలో మిగిలిన జిల్లాలు, పల్నాడు వైయస్సార్ కడప, కర్నూలు నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయంది. ఇక 28, 29 తేదీల్లోనూ భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని.. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోవాలని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది.