ప్రస్తుతం పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా సీసీటీవీలను ఏర్పాటు చేయడం సర్వసాధారణమైపోయింది.CCTV అంటే క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ – వీడియో ద్వారా నిఘా కోసం పనిచేస్తుంది. రక్షణతో పాటు నేర కార్యకలాపాలను అరికట్టడానికి ఉపయోగపడుతుంది.
ఆసుపత్రిలో రోగి సంరక్షణతో పాటు అనేక ఇతర కారణాల వల్ల వైద్య రంగంలో కూడా CCTVలను ఎక్కువగా ఉపయోగించడం జరగుతోంది. దీంతో రోగికి సమయానికి చికిత్స అందించడం సులభతరంగా మారిందనే చెప్పాలి.
భారతదేశంలో ఇంట్లో CCTV కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. అయితే వీటి విషయంలో అధికారాలు కొన్ని నిబంధనలు, షరతులు విధించారు. అవి మాత్రం పాటించాలి.
మీ ఆస్తిని మాత్రమే రికార్డ్ చేసేంత వరకు CCTV ఉపయోగించాలి. పొరుగువారి గోప్యతను ఉల్లంఘించనంత వరకు కెమెరాను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. CCTVలను ఏర్పాటు చేసినప్పుడు గోప్యతా హక్కుకు అనుగుణంగా ఉండాలి. మీ కెమెరాతో బహిరంగ ప్రదేశాలు లేదా ఇతరుల ఆస్తుల చిత్రాలను తీయడం నేరం.
భారతదేశంలోని మీ ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ వాడకాన్ని నియంత్రించడానికి ప్రత్యేకంగా ఎటువంటి చట్టం అమలులో లేదు. ఇంట్లో సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేసుకుంటే, మీ ఇంటికి వచ్చే వ్యక్తులకు, ముఖ్యంగా ఇంటి పని చేసే వారికి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి.