నవరాత్రులలో అత్యంత పవిత్రమైన వాటిలో ఒకటి కుమారి పూజ (కన్యా పూజ). ఈ పూజను నిర్వహించడం వల్ల ఆర్థిక సమస్యలు, కష్టాలు తొలగిపోతాయని, జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ పూజ ఎలా చేయాలి, ఏ వయసు బాలికను పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.
కుమారి పూజ నియమాలు
నవరాత్రి రోజుల్లో ఏ రోజైనా ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజ కోసం 2 నుండి 10 సంవత్సరాల వయస్సు బాలికను ఇంటికి ఆహ్వానించాలి. ఆ బాలికను అమ్మవారి స్వరూపంగా భావించాలి.
బాలికను ఒక పీటపై కూర్చోబెట్టి, ఆమె పాదాలను నీటితో శుభ్రం చేయాలి.
పాదాలకు పసుపు రాసి, పూలు చల్లి, సుగంధ ద్రవ్యాలు సమర్పించాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి.
పూజ తర్వాత బాలికకు కొత్త దుస్తులు ఇచ్చి, రుచికరమైన పదార్థాలతో భోజనం పెట్టాలి.
బాలికను బాల త్రిపురసుందరి దేవి రూపంగా భావిస్తే, అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం లభించి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
వయసును బట్టి ఫలితాలు
దేవీ భాగవతం ప్రకారం, బాలిక వయసును బట్టి ఒక ప్రత్యేక పేరు, ఫలితం ఉంటాయి.
2 సంవత్సరాలు (కుమారి): రెండు సంవత్సరాల బాలికను పూజిస్తే దారిద్య్ర సమస్యలు దూరమై ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.
3 సంవత్సరాలు (త్రిమూర్తి): ఈ బాలికను పూజిస్తే ఇంట్లో ధన, ధాన్యాలు పెరిగి, కుటుంబ వృద్ధి జరుగుతుంది.
4 సంవత్సరాలు (కళ్యాణి): ఈ పూజతో విద్యలో అభివృద్ధి సాధించవచ్చు. పిల్లలు బాగా చదువుకోవాలంటే ఈ పూజ చేయాలి.
5 సంవత్సరాలు (రోహిణి): ఐదు సంవత్సరాల బాలికను పూజిస్తే అన్ని రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
6 సంవత్సరాలు (కాళిక): కాళికను పూజించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి.
7 సంవత్సరాలు (చండిక): ఏడు సంవత్సరాల బాలికను పూజిస్తే రాజవైభోగం, సమాజంలో ఉన్నత స్థానం లభిస్తాయి.
8 సంవత్సరాలు (శాంభవి): ఈ బాలికను పూజిస్తే ఉద్యోగంలో పదోన్నతి, రాజకీయాలలో మంచి పేరు వస్తుంది.
9 సంవత్సరాలు (దుర్గా): దుర్గా రూపంలో ఉన్న బాలికను పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి.
10 సంవత్సరాలు (సుభద్ర): ఈ వయసు బాలికను పూజిస్తే మనసులోని అన్ని కోరికలు నెరవేరతాయి.
ఈ విధంగా నవరాత్రి ఉత్సవాలలో మీ కోరికను బట్టి తగిన వయసు బాలికను పూజించాలని పండితులు సూచిస్తున్నారు.
గమనిక: పైన తెలిపిన వివరాలు శాస్త్రాలు, జ్యోతిష్యం ఆధారంగా రాసినవి మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని విశ్వసించడం పూర్తిగా మీ వ్యక్తిగత నిర్ణయం.