రాజస్థాన్ రాష్ట్రంలోని సీకర్ జిల్లా ధోద్ ప్రాంతంలో అత్యాచార ఆరోపణలతో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి వచ్చిన మౌలాసర్ పోలీసు కానిస్టేబుళ్లపై దాడి జరిగింది. నిందితుడు గౌతమ్ ఇంటికి వెళ్లి పోలీసులు అతన్ని పట్టుకునే సమయంలో, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మహిళలు, పోలీసులపైనే దౌర్జన్యం చేశారు. ఈ క్రమంలో ఆ మహిళలు పోలీసుల జుట్టు లాగడం, చెంపదెబ్బలు కొట్టడం వంటి దారుణాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
అసలు ఆ నిందితుడి కేసు వివరాలు పరిశీలిస్తే.. డీడ్వానా-కుచామన్‌లోని మౌలాసర్ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికను సీకర్ జిల్లా ధోద్ కస్బాలోని అనోఖూ రోడ్ నివాసి గౌతమ్ అనే యువకుడు మాయమాటలతో తీసుకెళ్లాడు. ఆపై ఆమె వాంగ్మూలంలో గౌతమ్ రేప్ చేసినట్లు బయటపడింది. దీంతో పోలీసులు పోక్సో చట్టంతో పాటు మరికొన్ని సెక్షన్లు జోడించి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో భాగంగానే నిన్న సాయంత్రం 5.30 గంటల సమయంలో మౌలాసర్ పోలీస్ కానిస్టేబుళ్లు ముకేష్, విజేందర్.. నిందితుడు గౌతమ్‌ను అదుపులోకి తీసుకోవడానికి అతని ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో అతన్ని బయటికి తీసుకొస్తుండగా కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నారు. ఇదే అదనుగా భావించిన గౌతమ్ పారిపోవడానికి ప్రయత్నించగా.. పోలీస్ కానిస్టేబుళ్లు గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు గౌతమ్ పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. మరోవైపు గౌతమ్ కుటుంబ సభ్యులకు పోలీసులకు అడ్డు పడడంతో కాసేపు ఆ ప్రాంతంలో అలజడి రేగింది.
విషయం తెలుసుకున్న ధోద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గౌతమ్‌తో పాటు ఇతరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుళ్లు ముకేష్, విజేందర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై ధోద్ సీఓ సురేశ్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. పోక్సో కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి వచ్చిన మౌలాసర్ పోలీసులపై దాడి జరిగింది. ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డంకులు కలిగించడం తదితర సెక్షన్లలో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతోందని అన్నారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.