ఆస్తి తగాదాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో మరోసారి రుజువు చేసింది ఈ ఘటన. నంద్యాల జిల్లా మోతుకూరులో 9 నెలలు మోసి, కని పెంచిన కన్నతల్లే ఓ ఎకరం భూమి కోసం తన కొడుకును చంపిన ఘటన సంచలనం సృష్టించింది. మోతుకూరు గ్రామానికి చెందిన వెంకట శివమ్మకు 13 ఎకరాల పొలం ఉంది. అందులో ఆమె తన ఇద్దరు కుమారులైన సుధాకర్, శివాజీలకు చెరి 5 ఎకరాలు రాసిచ్చి, మూడు ఎకరాలను తన పేరుపై ఉంచుకుంది. సుధాకర్‌కు వచ్చిన ఐదెకరాల్లో ఒక ఎకరం భూమిని శివాజీ భూమిగా పేర్కొనడం వల్ల ఆ భూమిని సుధాకర్ అమ్ముకోవడానికి వీలులేకుండా పోయింది. అప్పులు తీర్చుకోవడానికి ఆ భూమిని అమ్ముకోవాలనుకున్న సుధాకర్, తన తమ్ముడు శివాజీని సంతకం చేయమని పలుమార్లు అడిగాడు. అయితే, శివాజీ సంతకం చేయడానికి నిరాకరించడంతో వారి మధ్య ఆస్తి వివాదం తలెత్తింది.
అమావాస్య రోజున విషాదం
పెత్తర్ల అమావాస్య సందర్భంగా తల్లి వెంకట శివమ్మ చిన్న కుమారుడు శివాజీ ఇంటికి వచ్చింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన సుధాకర్ మరోసారి ఆస్తి విషయంపై గొడవకు దిగాడు. గొడవ తీవ్రం కావడంతో కొద్దిసేపటి తర్వాత సుధాకర్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. దీంతో మృతుడి భార్య జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లి – మరిది చంపేశారు
మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు ప్రకారం.. తన భర్త సుధాకర్‌ను తల్లి వెంకట శివమ్మ కంట్లో కారం చల్లి, చీరతో ఉరివేసి చంపిందని ఆరోపించింది. ఈ దారుణానికి అత్త శివమ్మతో పాటు మరిది శివాజీ, అతని కుమార్తెలు కూడా కారణమని అందరూ కలిసి తన భర్తను చంపారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ పలుమార్లు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు అత్త, మరిదిని స్టేషన్‌కు పిలిపించినా రాలేదని జ్యోతి ఆరోపించింది. తన వాటాకు వచ్చిన భూమిని అమ్ముకోవడానికి వీలు లేకుండా చేశారని ఆ విషయంలోనే తన భర్తను అత్త చంపేసిందని ఆమె వివరించింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేవలం ఒక ఎకరం పొలం కోసం కన్న కొడుకును చంపుకోవడం ఎంత దారుణమని పలువురు చర్చించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.