తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు టీటీడీ కృతిమ మేదస్సును వినియోగించాలని నిర్ణయించుకుంది. ఏఐ టెక్నాలజీ పై ముందు నుంచి ఫోకస్ చేసిన టీటీడీ చైర్మన్ ఎన్ఆర్ఐల సహకారంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటులో ఈ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందిం చేందుకు చర్యలు చేపట్టనుంది టీటీడీ. గురువారంయ ఉదయం సీఎం చంద్రబాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) అందుబాటులోకి వస్తే ఎలా ఉపయోగపడుతుందనే ఆంశాలను పరిశిలిస్తే..
ఐసీసీసీలో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు.. ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు, సర్వదర్శనం పరిస్థితి లాంటి అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది.
టెక్నాలజీతో క్రైమ్ కంట్రోల్
ఇక ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా ఏఐ భక్తులను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంచనీయ ఘటనలు చోటు చేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల ముఖ కదలికలు ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసు
కుంటుంది. క్యూలైన్లు. వసతి ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో 3డీ మ్యాప్ లు, చిత్రాలతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు వాటి చర్యలకు సంకేతాలిస్తుంది.
ఆన్ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాలను కూడా ఇది అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అలాగే అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను కూడా ఇది చూపుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.