Vaibhav Suryavanshi : సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియాపై వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. మన బుడ్డోడు సూపరో సూపర్

Vaibhav Suryavanshi : సిక్సర్లు, ఫోర్లతో ఆస్ట్రేలియాపై వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం.. మన బుడ్డోడు సూపరో సూపర్


Vaibhav Suryavanshi : భారత అండర్-19 క్రికెట్ జట్టులో యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మన జట్టు, ఆసీస్ అండర్-19 జట్టుతో రెండవ యూత్ వన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌట్ అయ్యాక, వైభవ్ క్రీజులోకి వచ్చి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు.

ఈ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 54 బంతుల్లోనే అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. ఇది ఆస్ట్రేలియా గడ్డపై అతడికి మొదటి హాఫ్ సెంచరీ. గత మ్యాచ్‌లో కూడా 22 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టుకు మంచి ప్రారంభం ఇచ్చాడు. ఈ రెండవ మ్యాచ్‌లో, కెప్టెన్ నిరాశపరిచినా… విహాన్ మల్హోత్రాతో కలిసి వైభవ్ జట్టును నిలబెట్టాడు. ఇద్దరూ కలిసి రెండవ వికెట్‌కు 109 బంతుల్లో 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

సూర్యవంశీ ఇన్నింగ్స్ హైలైట్స్

ఆరంభంలో వైభవ్ చాలా నెమ్మదిగా ఆడాడు. మొదటి 41 బంతుల్లో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత గేర్ మార్చాడు. తర్వాతి 13 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో ఏకంగా 31 పరుగులు చేశాడు. దురదృష్టవశాత్తూ, అతడు సెంచరీ చేయలేకపోయాడు. 68 బంతుల్లో 6 సిక్సర్లు, 5 ఫోర్లతో 70 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయినప్పటికీ, ఈ ఇన్నింగ్స్ భారత్ జట్టుకు భారీ స్కోరు సాధించడానికి సహాయపడింది.

ఇంగ్లండ్‌లో కూడా వైభవ్ విశ్వరూపం

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్‌లో కూడా ఇదే విధమైన ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన 5 యూత్ వన్డే మ్యాచ్‌లలో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ సాయంతో ఏకంగా 355 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో సిక్సర్లు, ఫోర్లతో అలరించాడు, ఆ కారణంగానే భారత్ అండర్-19 జట్టు ఇంగ్లండ్‌లో ఘన విజయం సాధించింది.

ఇప్పుడు వైభవ్ అదే ఫామ్‌ను ఆస్ట్రేలియాలో కూడా కొనసాగిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో 22 బంతుల్లో 38 పరుగులు, ఆ తర్వాత రెండవ మ్యాచ్‌లో 70 పరుగులు చేసి తన బ్యాటింగ్‌తో భవిష్యత్తులో స్టార్ ప్లేయర్ అవుతాడని సంకేతాలు ఇచ్చాడు. అతడి పరుగుల దాహం చూస్తుంటే భవిష్యత్తులో మన భారత సీనియర్ జట్టులో కూడా స్థానం సంపాదించుకోవడం ఖాయం అనిపిస్తుంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *