
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో అమెరికా అధ్యక్షలవారి తర్వాతే ఎవ్వరైనా.. ఇప్పటికే తిక్కతిక్క నిర్ణయాలతో ప్రపంచానికే గత్తరలేపుతున్న ట్రంపుసారు.. మరోసారి సొంత డబ్బు కొట్టుకున్నారు. ఐక్యరాజ్యసమితి వేదికపైనే తానో ధీరుడు, సూరుడు, ప్రపంచశాంతి ధూతను అంటూ తెగ బిల్డప్ ఇచ్చుకున్నారు. ఇంతా చేస్తున్నా నోబెల్ బహుమతి ఇవ్వరా.. అంటూ రివర్స్ క్వశ్యన్ వేశారు ట్రంప్.యుద్ధాలెన్నో ఆపానంటారు.. అందరి సంగతీ తేలుస్తానంటారు.. ప్రపంచంలో ఎవరూ చేయలేనివెన్నో చేశానంటూ తనకు తానే వీరతాడు వేసుకుంటారు డొనాల్డ్ ట్రంప్. తన వ్యవహారశైలితో సెటైర్లకీ సెంటర్ పాయింటవుతున్న ట్రంప్.. ఐక్యరాజ్యసమితి వేదికగా పిచ్చి ప్రేలాపనలు చేసి మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. భారత్-పాకిస్తాన్ యుద్దాన్ని తానే ఆపినట్టు అక్కడా మరోసారి డబ్బాకొట్టుకున్నారు.
భారత్-పాక్ యుద్ధం ఒక్కటే కాదు… కేవలం తొమ్మిది నెలల్లోనే ఏడు యుద్దాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పనిచేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనులు తాను చేస్తునట్టు తెలిపారు. యుద్దాలను ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమయ్యిందన్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్ యుద్దం కొనసాగడానికి భారత్, చైనానే కారణమని పనిలో పనిగా నిందలు వేశారు. రష్యాకు ఈ రెండు దేశాలు పూర్తిగా సహకరిస్తున్నాయన్నారు.
మొత్తంగా… నోబెల్ బహుమతి కావాలనడం… భారత్‌ను మరోసారి ట్రంప్ ఇలా టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. మొదట సుంకాల బాంబ్ పేల్చిన ట్రంప్ తరువాత హెచ్1 బీ వీసాల ఫీజును పెంచి భారతీయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేశారు. ఫైనల్‌గా అంతా అమెరికా, అమెరికా పౌరుల కోసమే చేస్తున్నానని తన తీరును సమర్ధించుకోవడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.