Sachin Tendulkar vs Rahul Dravid: భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు ప్రత్యేకంగా నిలిచిపోతాయి. ఒకరు ‘క్రికెట్ దేవుడు’గా, మరొకరు ‘ది వాల్’గా తమ అద్భుతమైన ఆటతీరుతో అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇప్పుడు వీరి వారసులు, అర్జున్ టెండూల్కర్, సమిత్ ద్రవిడ్ కూడా తమ తండ్రుల బాటలో పయనిస్తూ క్రికెట్ రంగంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నారు.
తాజాగా, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) నిర్వహించిన ‘డాక్టర్ కె. తిమ్మప్పయ్య మెమోరియల్ టోర్నమెంట్’లో వీరిద్దరూ ముఖాముఖి తలపడ్డారు. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షించింది. గోవా జట్టు తరపున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్, KSCA సెక్రటరీస్ ఎలెవన్ జట్టులో ఉన్న సమిత్ ద్రవిడ్‌ను ఎదుర్కొన్న ఈ పోరులో ఏం జరిగిందో తెలుసుకుందాం.
బౌలింగ్ Vs బ్యాటింగ్: ఎవరు పైచేయి సాధించారు?
ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ తన బౌలింగ్‌తో మెరిపించాడు. గోవా జట్టు తరపున మొదట బ్యాటింగ్ చేసిన అర్జున్ తొమ్మిది పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచినా, బౌలింగ్‌లో మాత్రం సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్‌కు దిగగా, అర్జున్ తన ఖచ్చితమైన బౌలింగ్‌తో సమిత్ ద్రవిడ్ వికెట్ తీశాడు.
సమిత్ ద్రవిడ్ 26 బంతులు ఎదుర్కొని కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. ఈ స్వల్ప ఇన్నింగ్స్‌లో రెండు బౌండరీలు కూడా ఉన్నాయి. అయితే, చివరికి అర్జున్ వేసిన బంతికి కశాబ్ బాక్లేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో టెండూల్కర్ కుమారుడు, ద్రవిడ్ కుమారుడిని అవుట్ చేయడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇది కేవలం ఒక మ్యాచ్‌లో జరిగిన సంఘటన మాత్రమే కాదు, భారత క్రికెట్ భవిష్యత్తుకు ఒక చిన్న సూచనలా అనిపించింది.
ఇవి కూడా చదవండి
వారి తండ్రులలాగే…
2003లో జరిగిన ఒక ఛాలెంజర్ ట్రోఫీ ఫైనల్‌లో, సచిన్ టెండూల్కర్ బౌలింగ్‌లో రాహుల్ ద్రావిడ్ అవుటయ్యాడు. సరిగ్గా 22 సంవత్సరాల తర్వాత అదే దృశ్యం మళ్ళీ పునరావృతమైంది. ఈసారి కుమారుల మధ్య. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
అర్జున్ టెండూకర్, సమిత్ ద్రావిడ్ ఇద్దరూ ఆల్‌రౌండర్‌లే. అర్జున్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్, బ్యాటింగ్ కూడా చేయగలడు. గోవా తరపున దేశవాళీ క్రికెట్‌లో ఆడుతున్న అర్జున్ ఇప్పటికే కొన్ని మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. అలాగే, ముంబై ఇండియన్స్ జట్టులో కూడా ఉన్నాడు. ఇక సమిత్ ద్రవిడ్, బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా తన తండ్రి రాహుల్ ద్రవిడ్ లాగే స్థిరమైన ఆటతీరును కనబరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ఈ యువ క్రికెటర్లు తమ తండ్రుల స్థాయికి చేరేందుకు ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే, ఇలాంటి పోరులు వారికి మంచి అనుభవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. భారత క్రికెట్ భవిష్యత్తు వీరి చేతుల్లో సురక్షితంగా ఉందని చెప్పడానికి ఈ మ్యాచ్ ఒక ఉదాహరణ. రాబోయే రంజీ ట్రోఫీ, ఇతర దేశవాళీ టోర్నమెంట్‌లలో వీరి ప్రదర్శనలు ఎలా ఉంటాయో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..