ఛత్తీస్‌గఢ్, సెప్టెంబర్ 23: కేంద్రకమిటీ నాయకులు నేలకొరుగుతున్నారు. సాయుధ దళాలు చెల్లాచెదురవుతున్నాయి. దట్టమైన అడవుల్ని భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. వార్ వన్‌సైడ్ అన్నట్లుంది మావోయిస్టుల ఏరివేత. చూస్తుంటే డెడ్‌లైన్ కంటే ముందే ఆపరేషన్ కంప్లీట్ చేసేలా ఉంది కేంద్ర హోంశాఖ. ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తుపాకులు గర్జించాయి. నారాయణ్‌పూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు హతమయ్యారు. కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, కట్టా రామచంద్రా రెడ్డి అలియాస్ వికల్ప్ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది.
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత రెట్టించిన ఉత్సాహంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. పక్కా సమాచారంతో మావోయిస్టులను రౌండప్ చేస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేతపై సంచలన ట్వీట్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. అగ్రనాయకులను ఏరివేశామని.. మిగతా వాళ్లని కూడా అంతం చేస్తామని ప్రకటించారు. 2026 మార్చి 31. దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు కేంద్ర హోంశాఖ పెట్టుకున్న డెడ్‌లైన్ ఇది. కానీ ఈలోపే ఆ పని పూర్తిచేస్తాం అన్నట్లుంది భద్రతా బలగాల దూకుడు. ఆపరేషన్ కగార్తో పాటు ఇటీవల కర్రెగుట్టల్లో కూంబింగ్‌తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు అంటున్నా.. అందుకు సిద్ధంగా లేమని సంకేతాలిస్తోంది కేంద్రం. అన్ని వైపులనుంచి దిగ్బంధించి మావోయిస్టులను సమూలంగా ఏరివేయాలన్న లక్ష్యంతో ఉంది.
మావోయిస్టులతో చర్చించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతో పాటు, నక్సల్స్ సానుభూతిపరులు డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్రం దానికి సిద్ధంగా లేదని అమిత్‌షా ట్వీట్‌తో తేలిపోయింది. చర్చల ప్రతిపాదనని కేంద్రం కనీసం పట్టించుకోవడం లేదంటున్నారు పౌరహక్కుల నేతలు. మావోయిస్టు కేంద్ర నాయకత్వంపై కేంద్ర బలగాలు గురిపెట్టాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు సెంట్రల్ కమిటీ దాదాపు ఖాళీ అయింది. ఆపరేషన్ కగార్ మొదలు పెట్టిన తర్వాత ఇప్పటిదాకా మావోయిస్టు కేంద్ర కమిటీలో 11 మంది కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సెంట్రల్ కమిటీలో ఇప్పుడు మిగిలింది ఇక ఏడుగురే. అందుకే ఊపిరిపీల్చుకునే అవకాశం ఇవ్వకుండా ముప్పేటదాడి చేస్తున్నాయి భద్రతా బలగాలు.
ఇవి కూడా చదవండి
తీవ్ర నిర్బంధ పరిస్థితులతో మావోయిస్టులు ఇటీవల బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించడం ఉద్యమ చరిత్రలోనే కీలక పరిణామం. పార్టీ అధికార ప్రతినిధి అభయ్ రాసిన ఆ లేఖతో మావోయిస్టులు ఆత్మరక్షణలో పడ్డట్లు అర్ధమవుతోంది. అయితే లొంగుబాటు తప్ప మావోయిస్టులకు మరోమార్గం లేదంటున్న కేంద్రం.. ఈ ప్రకటనపై స్పందించలేదు. ఏమాత్రం వెసులుబాటు ఇచ్చినా ఆపరేషన్ సైడ్‌ట్రాక్ పడుతుందనే ఆలోచనతో ఉంది కేంద్రం. 2014 నుంచి దేశవ్యాప్తంగా 1700మంది మావోయిస్టులు హతమయ్యారు. 345 మంది మావోయిస్టు నాయకులు ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. కేంద్రం పెట్టుకున్న డెడ్‌లైన్ లోపు ఇంకెన్ని ఎన్కౌంటర్లు జరుగుతాయో, మరెన్ని ప్రాణాలు గాల్లో కలుస్తాయో అంచనాలకు అందడం లేదు.
మావోయిస్ట్ అగ్రనేతల వరుస ఎన్కౌంటర్ల వెనక సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. మావోయిస్ట్ పార్టీ వరుసగా అగ్రనేతలను కోల్పోవడానికి కోవర్ట్ ఆపరేషనే కారణంగా తెలుస్తోంది. నాలుగు నెలలక్రితం మొదలైన కోవర్ట్ ఆపరేషన్‌లో మొదట హతమైంది నంబాల కేశవరావు. అప్పటి మావోయిస్ట్ సుప్రీం కమాండర్, మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాలను కోవర్ట్ ఆపరేషన్‌తోనే అంతమొందించాయి బలగాలు. నంబాల కేశవరావు వ్యూహం విఫలమవడంతో ఈ కోవర్ట్ ఆపరేషన్ మొదలైంది. తన దగ్గర పనిచేసే ఐదుగురు మావోయిస్టులను ఛత్తీస్‌గఢ్ పోలీస్ DRGలో చేర్పించారు నంబాల కేశవరావు. అయితే, కొద్దిరోజులకే నంబాల దగ్గర పనిచేసే ఇద్దరు మావోయిస్టులు.. పోలీసుల ముందు లొంగిపోవడంతో సీన్ రివర్సైంది. ఆ ఇద్దరు మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతోనే నంబాల ప్లాన్‌ను కనిపెట్టారు ఛత్తీస్‌గఢ్ పోలీసులు.
పోలీసుల ముసుగులో ఉన్న ఐదుగురు మావోయిస్టులను ట్రేస్ చేశారు DRG అధికారులు. ఆ ఐదుగురు మావోయిస్ట్ పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే మొదట నంబాల ఎన్కౌంటర్ జరిగింది. నంబాల కేశవరావు కదిలికలను పక్కాగా కనిపెట్టి ఒకేరోజు 27మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఆ ఐదుగురు మావోయిస్ట్ పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే మిగతా అగ్రనేతల వరుస ఎన్కౌంటర్లు జరిగాయి. నిన్న జరిగిన కడారి సత్యనారాయణరెడ్డి, కట్టా రామచంద్రారెడ్డి ఎన్కౌంటర్ కూడా కోవర్ట్ ఆపరేషన్‌తోనే జరిగింది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు కేంద్ర కమిటీ దాదాపుగా ఖాళీ అయ్యింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.