
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల ముప్పు నెలకొంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించిన విధంగా సెప్టెంబర్ 25న మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది సెప్టెంబర్ 27 నాటికి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం దాటే అవకాశం ఉంది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రంలో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రకర్ జైన్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.