యర్రగొండపాలెం, సెప్టెంబర్ 23: మానవ బంధాలు నానాటికీ మసకబారుతున్నాయి. చిన్న కారణానికే అపర్ధాలతో మొదలై ఆత్మహత్యలతో సమస్యకు ముగింపు పలుకుతుంది నేటి యువత. తరచూ ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది. ఓ భర్త ఆదివారం పూట చికెన్ వండాలని భార్యను మురిపెంగా కోరాడు. కానీ భార్య మాత్రం పంతంతో భర్తకు పచ్చడి మెతుకులు వేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త క్షణం కూడా ఆలోచించకుండా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ షాకింగ్ ఘటన ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామంలో సోమవారం (సెప్టెంబర్ 22) చోటు చేసుకుంది. ఎస్సై పి.చౌడయ్య తెల్పిన వివరాల ప్రకారం..
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని గోళ్లవిడిపి గ్రామానికి చెందిన ఇళ్ల లక్ష్మీనారాయణ (25), అతడి భార్య స్థానికంగా కాపురం ఉంటున్నాడు. ఆదివారం లక్ష్మీ నారాయణ తన భార్యతో గొడవ పడ్డాడు. తనకు రోజూ భార్య పచ్చడి అన్నం పెడుతుందని దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆదివారం కావడంతో చికెన్ తినాలని ఉందని భార్యకు చెప్పినా ఆమె చికెన్ వండలేదు. దీంతో భర్త లక్ష్మీనారాయణ తీవ్రమనస్థానికి గురయ్యాడు. అంతే.. పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై పి.చౌడయ్య మీడియాకు తెలిపారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.