కేరళలోని కొల్లంలో ఒక వ్యక్తి తన భార్యను నరికి చంపిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన సెప్టెంబర్ 22న పునలూర్ సమీపంలోని కూతనడిలో జరిగింది. భార్యను చంపిన తర్వాత నిందితుడు ఫేస్బుక్ లైవ్లో తాను హత్య చేసినట్లు ప్రకటించాడు. మరణించిన మహిళను ప్లాచేరిలోని కూతనడి నివాసి అయిన షాలిని (39)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని ఐజాక్ గా గుర్తించారు.
తన భార్య షైలిన్ ను హత్య చేసిన తర్వాత ఐజాక్ పునలూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. షైలిన్, ఐజాక్ వైవాహిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఉదయం 6:30 గంటల ప్రాంతంలో షైలిన్ స్నానం చేయడానికి వంటగది వెనుక ఉన్న పైప్లైన్ దగ్గరకు వెళ్ళినప్పుడు, ఐజాక్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో షాలిని మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆమె విలవిల్లాడి మరణించింది. తన భార్యను చంపిన వెంటనే ఐజాక్ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. అందులో భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. తనపై నమ్మకం లేకపోవడం, అలాగే ఆభరణాల దుర్వినియోగం చేసిందని, అందుకే ఆమెను హతమార్చినట్లు లైవ్లో వెల్లడించాడు.
తర్వాత అతను పోలీస్ స్టేషన్కు చేరుకుని తన భార్యను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వెంటనే పోలీసుల బృందం ఆ ఇంటికి చేరుకొని అక్కడ షైలిన్ మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఐజాక్, షైలిన్ మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి