ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వెల్లడించింది. ఇదే కాకుండా ఈ నెల 25న మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అది వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ నెల 27న వాయుగుండం దక్షిణ ఒడిశా -ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. కాగా నేడు, రేపు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నేడు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలు..
అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి