దేవీ నవరాత్రులలో రెండవ రోజు ఆశ్వయుజ శుక్ల తదియ నాడు కదంబవనవాసిని అయిన ఆ పరమేశ్వరి శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులతో పూజలను అందుకుంటుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనక దుర్గమ్మ నవరాత్రులలో రెండో రోజున చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో కాషాయం రంగు లేదా కనకాంబరం చీర ధరించి అత్యంత సుందరంగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఆదిశంకరాచార్యులు ఆరాధించిన ఈ గాయత్రీ దేవిని దర్శినంత మాత్రానే మనసు పులకితమౌతుంది. దైవ శక్తులకే మూలాధారం శ్రీ గాయత్రీ మాత.
అటువంటి గాయత్రిదేవి తనని ధ్యానిస్తూ తన స్వర్వ మంగళ స్వరూపాన్ని దర్శించుకునే భక్తుల ఇంట సిరి సంపదలకు లోటు కలుగనీయదు. గాయత్రీ దేవి శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి తేజోవంతమైన అయిదు ముఖాలతో జ్ఞాన జ్యోతులను వెదజల్లుతూ శోభనమూర్తిగా కొలువై ఉంటుంది.
ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీ మహీ థియో యోనః ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్రాన్ని భక్తితో పటిస్తే చాలు బుద్ధి జ్ఞానం తోజోవంతం అవుతుంది. గాయత్రీ దేవి అలంకారంలో అమ్మ వారిని పూజిస్తే చతుర్వేద పారాయణ ఫలితం కలుగుతుంది. ఈ రోజు గాయత్రీ కవచం చదవం అత్యంత ఫలవంతం.
ఇవి కూడా చదవండి
గాయత్రీ దేవి పంచముఖాలు.. పంచభూతాలకు ప్రతీక. విశ్వ క్షేమానికై గాయత్రీ దేవిని పూజించడం తప్పనిసరి. అందుకనే దేవీ నవరాత్రులలో రెండో రోజు అమ్మవారు గాయత్రీ దేవిగా పూజలను అందుకుంటున్నారు. గాయత్రీ దేవి అష్టోత్తరంతో షోడశోపచార పూజ చేసి.. తామర లేదా కలువ పువ్వులను సమర్పించింది.. గాయత్రీ మంత్రాన్ని లేదా గాయత్రి కవచాన్ని పఠించి అమ్మకు ఇష్టమైన చలిమిడి, వడపప్పు, పానకంతో పాటు కొబ్బరి అన్నం, అల్లపు గారెలను నైవేద్యంగా సమర్పిస్తే .. అమ్మ తన భక్తులను చల్లగా చూస్తుందని.. కంటికి రెప్పలా కాచికాపాడుతుంది.
ఇంద్రకీలాద్రిపై గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్న దుర్గమ్మ దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఈ రోజు తెల్లవారు జామున 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభం అయ్యాయి. కాగా దసరా నవరాత్రులలో మొదటి రోజు భక్తజనం విశేషం గా తరలివచ్చారు. 60 వేల మందికి పైగా భక్తులు బాల సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. తొలిరోజు పలు రకాల సేవల, దర్శన టికెట్ల రూపేణా రూ. 22 లక్షల 72 వేల 214 రూపాయల ఆదాయం లభించినట్లు ఆలయ సిబ్బంది చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు