
సూర్యాపేటలో కృష్ణా టాకీస్ ఎదురుగా కొన్నేళ్లుగా ఉన్న జానీ చికెన్ & మటన్ సెంటర్కు ఇటీవల గిరాకీ తగ్గింది. దీంతో ఆ చికెన్ సెంటర్ యజమాని నాగరాజు తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు దసరా పండుగను వేదికగా చేసుకోవాలని భావించాడు. ఇందుకోసం
ఓ విలక్షణమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు . కేవలం రూ. 150 చెల్లించి లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కల్పిస్తూ విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులను ప్రకటించారు. మొదటి బహుమతి 15 కేజీల బరువున్న గొర్రెపోతు, బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్… రెండో బహుమతి బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్ ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. దీంతో పండుగపూట అదృష్ట దేవతలు పరీక్షించుకునేందుకు చాలామంది వినియోగదారులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఇందులో కేవలం పురుషులే కాకుండా మహిళలు కూడా పోటీ పడుతున్నారు.
మహిళల కోసం ప్రత్యేకంగా పట్టు చీరలను కూడా బహుమతిగా ఇవ్వనున్నట్లు చికెన్ సెంటర్ యజమాని నాగరాజు చెబుతున్నాడు. ఇప్పటికే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, 150 రూపాయలు కడితే టోకెన్ ఇస్తామని చెబుతున్నాడు. దసరా పండుగ ముందు రోజు లైవ్ రికార్డింగ్ పెట్టి డ్రా తీసి విజేతలకు బహుమతి ఇస్తామని, కేవలం వంద మందికి మాత్రమే ఈ అవకాశం అని వెల్లడించాడు. పండుగల సమయంలో చాలా మంది స్కూటీలు, ఇతర వస్తువులతో లక్కీ డ్రాలు నిర్వహించడం చూసి ప్రేరణ పొందానని, తమ చికెన్ సెంటర్ కూడా వ్యాపారపరంగా పుంజుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రయోగంతో తమ షాపు ఫేమస్ అయ్యి తమకు మంచి ఫలితాలను ఇస్తుందని నాగరాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.
ఎవడైనా గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటి ఇతర వస్తువులు స్కీంలు పెడతారు గాని గొర్రెపోతు, ఫుల్ బాటిల్ బహుమతులు ఇవ్వడం ఎక్కడా చూడలేదని లోకల్లో ఒకటే చర్చ జరుగుతుంది. అయితే ఈ వినూత్న ప్రయత్నం వ్యాపార వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మార్కెట్లో పోటీని తట్టుకుని నిలబడటానికి ఇలాంటి సృజనాత్మక ఆలోచనలు ఎంతవరకు తోడ్పడతాయో వేచి చూడాలి.