ఎలాంటి కారణం లేకుండానే మీ గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుందా? ఈ పరిస్థితి చాలామందికి కలుగుతుంది. దీనికి గల కారణాలు, ఎప్పుడు ఆందోళన చెందాలో ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ ఇక్కడ వివరించారు.
సాధారణ గుండె రేటు ఎంత?
పెద్దలలో సాధారణ గుండె రేటు నిమిషానికి 60 నుండి 100 బీట్స్ వరకు ఉంటుంది. వయస్సు, ఫిట్ నెస్ స్థాయి, మందుల వాడకం లాంటి విషయాలు గుండె రేటును ప్రభావితం చేస్తాయి. నిమిషానికి 100 బీట్స్ కంటే ఎక్కువగా ఉంటే దానిని ట్యాచీకార్డియా అంటారు. ఇది తరచుగా వస్తే లేదా ఛాతీ నొప్పి, మైకం, శ్వాస ఆడకపోవడం లాంటి లక్షణాలు ఉంటే ఆందోళన చెందాలి.
వేగంగా గుండె కొట్టుకోవడానికి సాధారణ కారణాలు:
ఒత్తిడి, ఆందోళన: ఒత్తిడి, ఆందోళన వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది. ‘ఫైట్ ఆర్ ఫ్లైట్’ ప్రతిస్పందన వల్ల అడ్రినలిన్ విడుదల అవుతుంది. అది గుండె రేటును పెంచుతుంది.
డీహైడ్రేషన్: శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు రక్త ప్రసరణను కొనసాగించడానికి గుండె వేగంగా కొట్టుకుంటుంది. కొద్దిపాటి డీహైడ్రేషన్ కూడా గుండె రేటులో మార్పును తీసుకురావచ్చు.
కెఫీన్, ఇతర పదార్థాలు: కెఫీన్, నికోటిన్, కొన్ని మందులు లేదా ఎనర్జీ డ్రింక్స్ గుండెను ప్రేరేపిస్తాయి.
హార్మోన్ల మార్పులు: థైరాయిడ్ గ్రంధిలో, లేదా రుతువిరతి సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు గుండె లయను ప్రభావితం చేస్తాయి.
అరిథ్మియా: కొన్ని సందర్భాలలో, గుండెలో అసాధారణ విద్యుత్ మార్గం ట్యాచీకార్డియాకు కారణం అవుతుంది. సుప్రావెంట్రిక్యులర్ ట్యాచీకార్డియా (SVT) వల్ల గుండె రేటు ఒక్కసారిగా వేగంగా పెరుగుతుంది. ఇవి సాధారణంగా ప్రాణాంతకం కావు. కానీ వైద్య సహాయం తీసుకోవాలి.
పొజిషనల్ ఆర్థోస్టాటిక్ ట్యాచీకార్డియా సిండ్రోమ్ (POTS): ఈ పరిస్థితి యువకులలో ఎక్కువగా కనిపిస్తుంది. నిలబడినప్పుడు గుండె రేటు అసాధారణంగా పెరుగుతుంది. దీని వల్ల మైకం, అలసట, గుండె దడ లాంటి లక్షణాలు కలుగుతాయి.
వైద్యుడిని ఎప్పుడు కలవాలి?
వేగంగా గుండె కొట్టుకోవడం అప్పుడప్పుడు వస్తే అది ప్రమాదకరం కాదు. కానీ, ఈ క్రింది లక్షణాలు ఉంటే వైద్య సహాయం అవసరం:
నిమిషానికి 120 బీట్స్ కంటే ఎక్కువ గుండె రేటు
ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, స్పృహ కోల్పోవడం
ఈ పరిస్థితి తరచుగా రావడం
మీకు గుండె జబ్బులు లాంటి సమస్యలు ఉంటే
గుండె వేగంగా కొట్టుకుంటే ఏమి చేయాలి?
వేగంగా గుండె కొట్టుకుంటే, ఆందోళన కలిగించే ఇతర లక్షణాలు లేకపోతే కొన్ని సాధారణ పద్ధతులు సహాయపడతాయి.
నెమ్మదిగా, లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ సక్రియం అవుతుంది. అది గుండె రేటును తగ్గిస్తుంది.
డీహైడ్రేషన్ కారణం అయితే నీళ్లు, ఎలక్ట్రోలైట్ ద్రవాలు తాగండి.
కెఫీన్ లాంటి వాటికి దూరంగా ఉండండి.
ఒత్తిడిని తగ్గించుకోండి.
ఈ పరిస్థితి వచ్చిన తర్వాత వైద్యుడిని సంప్రదించండి.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా కాదు. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యులు ఉన్నా నిపుణులైన వైద్యుడిని సంప్రదించి, పూర్తి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. స్వీయ-వైద్యం ప్రమాదకరం.