హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుంచి వర్షం పడుతోంది.రానున్న రెండు- మూడు గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వర్షాల నేపథ్యంలో ముందస్తు హెచ్చరికలతో పాటు GHMC , మాన్సూన్ హైడ్రా, DRF, ట్రాఫిక్ సిబ్బందిని IMD అప్రమత్తం చేసింది.
ఎల్బీనగర్, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీగా వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, మణికొండ, గచ్చీబౌలి, హైటెక్ సిటీ, నానక్ రామ్ గూడలో జోరువాన కురుస్తోంది. SR నగర్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, బోరబండ, యూసఫ్‌గూడ, సనత్‌నగర్, మూసాపేట్‌లో కూడా జడివాన పడుతోంది. కూకట్‌పల్లి, కేబీహెచ్‌బీ, మియాపూర్‌లోనూ ఇదే పరిస్థితి. దీంతో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలు చోట్ల మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి.
అల్పపీడనాలు దూసుకొస్తున్నాయి. వర్షాలు వీడనంటున్నాయి. యస్…! తెలుగు రాష్ట్రాల్లో ఈ వారమంతా భారీ వర్షాలు, వరదలు తప్పేలా లేవు. ప్రస్తుతం ఓ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా మరో రెండు అల్పపీడనాలు రెడీ అవుతున్నాయట… వీటి ప్రభావంతో ఈ వీక్ అంతా వర్ష బీభత్సమే అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.
బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత మరొకటి అల్పపీడనాలు ఏర్పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వణుకు మొదలైంది. ఉత్తర బంగాళాఖాతంలో ఇవాళ ఒక అల్పపీడనం ఏర్పడగా.. ఈనెల 25న మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వరుస అల్పపీడనాల ప్రభావంతో ఏపీలో ఈ నెల 25 నుంచి మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 2 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తెలంగాణలో మరో రెండురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని హెచ్చరించింది.
ఆగస్టులో సార్ట్ అయిన వర్షాలు మధ్యమధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ కుండపోతగా కురుస్తున్నాయి. అయితే ఈ సెప్టెంబర్ మొత్తం వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరీముఖ్యంగా ఈవారం రెండురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని IMD హెచ్చరిస్తోంది.