Lionel Messi : ఫుట్‌బాల్ దిగ్గజం ప్రపంచ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. 14 ఏళ్ల తర్వాత మెస్సీ భారత్‌కు రాబోతుండటంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రాబోతున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం సాయంత్రం ఈ విషయాన్ని ధృవీకరించారు. గోట్ టూర్లో భాగంగా మెస్సీ డిసెంబర్ 14, 2025న ముంబైకి వస్తారని తెలిపారు. గతంలో 2011లో కోల్‌కతాలో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం మెస్సీ భారత్‌కు వచ్చారు.
సీఎంకు మెస్సీ సంతకం చేసిన ఫుట్‌బాల్
మెస్సీ పర్యటన ఖరారైన సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు తన సంతకం చేసిన ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ స్వయంగా తన ఎక్స్ హ్యాండిల్లో పంచుకున్నారు. ‘‘లియోనెల్ మెస్సీ మహారాష్ట్రకు వస్తున్నారు, నా యువ మిత్రులతో ఫుట్‌బాల్ ఆడబోతున్నారు! నాకు తను సంతకం చేసిన ఫుట్‌బాల్‌ను బహుమతిగా ఇచ్చినందుకు మెస్సీకి ధన్యవాదాలు! డిసెంబర్ 14న గోట్ టూర్లో భాగంగా ముంబైకి రాబోతున్న ఆయన పర్యటనకు స్వాగతం పలుకుతున్నాను” అని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.
యువ ఆటగాళ్లకు మెస్సీతో శిక్షణ
మెస్సీ పర్యటన మహారాష్ట్రలోని యువ ఫుట్‌బాల్ క్రీడాకారులకు ఒక గొప్ప అవకాశం. రాష్ట్ర క్రీడా విభాగం, మిత్ర (MITRA), వెస్టర్న్ ఇండియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (WIFA) కలిసి మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 ఏళ్ల లోపు యువ క్రీడాకారులను ఎంపిక చేస్తాయి. డిసెంబర్ 14న ఈ యువ క్రీడాకారులకు మెస్సీతో కలిసి శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది. ఈ కార్యక్రమం యువతలో ఫుట్‌బాల్ పట్ల మరింత ఆసక్తిని పెంచుతుందని ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహాయం చేయాలని ఆయన కార్పొరేట్ సంస్థలను కూడా కోరారు.
Guess what!
Lionel Messi is coming to Maharashtra and….
will play football with you, my young friends 😊!Thank you, Messi for gifting me your personally signed football!
I welcome your forthcoming visit to Mumbai on 14th December 2025, as a part GOAT Tour!Under-14 young… pic.twitter.com/YkuicNk4dT
— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 21, 2025
కేరళలో ఫ్రెండ్లీ మ్యాచ్
మెస్సీ పర్యటన కేవలం ముంబైకే పరిమితం కాదు. కేరళ క్రీడా మంత్రి వి అబ్దురహీమాన్ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించారు. నవంబర్ 2025లో జరిగే ఫిఫా అంతర్జాతీయ విండో సందర్భంగా మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా జాతీయ జట్టు కేరళలో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. ఈ విషయాన్ని అధికారిక ఈమెయిల్ ద్వారా ధృవీకరించినట్లు అబ్దురహీమాన్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..