Tirumala: శ్రీవారి పరకామణిలో చోర శిఖామణి.. రూ. కోట్లు కొట్టేసిన ఉద్యోగి రవికుమార్‌..

Tirumala: శ్రీవారి పరకామణిలో చోర శిఖామణి.. రూ. కోట్లు కొట్టేసిన ఉద్యోగి రవికుమార్‌..


నిత్యకల్యాణం..పచ్చతోరణంగా విలసిల్లే తిరుమల కొండ వరుస వివాదాలకు కేంద్రంగా మారుతోంది. ఇటీవల  లడ్డూ వివాదం బైటపడినప్పటి నుంచి తిరుమల ప్రతిరోజు ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉంటుంది. తాజాగా టీడీ పరకామణిలో చోరీ తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దొంగను పట్టుకున్నారు. అయితే ఆ దొంగ వెనుకాల ఉంది మీరంటే మీరంటూ వైసీపీ, కూటమి నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. భూమన వర్సెస్‌ భానుప్రకాష్‌ అండ్‌ కిరణ్‌ రాయల్‌గా ఈ ఎపిసోడ్‌ టర్న్‌ తీసుకుంది. పరకామణి పాలిటిక్స్‌ ఏపీలో కాక రేపుతోంది. తన హయాంలో తప్పు జరిగిందని తెలిస్తే తల నరుక్కుంటానన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి.

సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్

పరకామణిలో చోరీని బయటపెట్టి.. రవికుమార్ నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేశామన్నారు భూమన కరుణాకర్‌రెడ్డి. 20 ఏళ్లుగా రవికుమార్‌ పరకామణిలో చోరీ చేస్తున్నాడని, చంద్రబాబు హయాంలో కూడా దొంగతనాలు చేశాడని, అప్పుడు రవికుమార్‌ను చంద్రబాబు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు భూమన. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు భూమన.

2 రోజుల్లో వెలుగులోకి సంచలన విషయాలు

ఇదే విషయంపై బిజేపీ నేత భానుప్రకాష్ మాట్లాడతూ.. మరో రెండు రోజుల్లో సంచలన విషయాలు బయటకు వస్తాయన్నారు. సీబీఐ దాకా పనిలేదు, ఎస్సై విచారించినా అన్నీ తెలుస్తాయని భూమనకు కౌంటర్‌ ఇచ్చారు.

రూ. 300 కోట్ల దోపిడీ అన్న కిరణ్‌ రాయల్‌

ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్‌ బతికి ఉన్నాడో లేదో అనుమానంగా ఉందన్నారు జనసేన నేత కిరణ్‌ రాయల్‌. రవికుమార్‌ 300 కోట్లు దొంగతనం చేశాడని ఆరోపించారు కిరణ్‌ రాయల్‌. రవికుమార్‌ నుంచి వైసీపీ పెద్ద తలకాయలతో పాటు అధికారులకు కూడా ముడుపులు ముట్టాయని ఆరోపించారు జనసేన నేత.

అయితే తిరుమలలో వెలుగు చూస్తున్న ఈ వరుస వివాదాలు..ఓవైపు రాజకీయ రచ్చ రేపుతుండగా మరోవైపు కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. నీరు పల్లమెరుగు.. నిజము దేవుడెరుగు! ఈ మేటర్‌లో చోరుల వెనక ఉన్న అసలు వ్యక్తులెవరు? జాడ తెలుసుకోవాలని.. శ్రీవారి సొమ్ము నొక్కేసిన రవికుమార్‌ వెనుక ఉన్నది ఎవరో తేల్చాలంటున్నారు భక్తులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *