హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురిసింది. పలుచోట్ల వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో రహదారులు నీటమునిగాయి. ముఖ్యంగా బాలాపూర్, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, మహేశ్వరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. బాలాపూర్‌లో 9.1 సెం.మీ, ఇబ్రహీంపట్నంలో 9 సెం.మీ, హయత్‌నగర్‌లో 8.5 సెం.మీ, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 7.6 సెం.మీ, మహేశ్వరంలో 7.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఈ కుండపోత వర్షం కారణంగా అనేక ప్రధాన రహదారులపై నీరు నిల్వ ఉండి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.
హఠాత్తుగా కురిసిన వర్షంతో GHMC, హైడ్రా సిబ్బంది అప్రమత్తమై నీటి పారుదల పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షం కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగింది. అయినా వర్షం ఉత్సాహాన్ని తగ్గించలేకపోయింది. బతుకమ్మ పండుగ సందడి నగరంలో కొనసాగింది. కుండపోత వాన పడుతున్నప్పటికీ మహిళలు బతుకమ్మలు ఆడుతూ పండుగ ఉత్సాహాన్ని కొనసాగించారు. జోరు వానలోనూ “తగ్గేదే లేదంటూ బతుకమ్మలు ఆడిన మహిళల ఉత్సాహం చూసి అక్కడున్నవారు ఆశ్చర్యపోయారు.
మొత్తం మీద, ఒకవైపు కుండపోత వర్షం, మరోవైపు బతుకమ్మ సందడి నగరానికి ప్రత్యేక రంగు పులిమాయి. GHMC వర్షాకాల జాగ్రత్తలు కొనసాగిస్తూ పౌరులను జాగ్రత్తగా ఉండాలని సూచించింది.