
హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో ఓ లారీ డ్రైవర్ భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. తన సీటు కింద ఏకంగా ఏడు అడుగుల నాగుపాము తిష్టవేసి ఉండటంతో అతను షాక్‌కు గురయ్యాడు. దాదాపు 300 కిలోమీటర్ల ప్రయాణం పూర్తయ్యాక పాము విషయం బయటపడింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ నుంచి అంబాలాకు లారీ వస్తుండగా.. ప్రయాణం మధ్యలో డ్రైవర్‌కు క్యాబిన్‌లో ఏదో హిస్ శబ్దం వినిపించింది. మొదట అది టైరు నుంచి గాలి లీకేజీ వల్ల వచ్చిందని భావించి పెద్దగా పట్టించుకోలేదు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో వాహనాన్ని ఒక చోట నిలిపి, టీ తాగి తిరిగి వచ్చిన డ్రైవర్ సీటు వద్ద చూసి షాక్‌కు గురయ్యాడు. సీటు కింద పెద్ద నాగుపాము నక్కి ఉండటం చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.
తక్షణమే లారీ యజమానికి సమాచారం ఇచ్చి, స్థానిక అటవీ శాఖ అధికారులకు తెలియజేశాడు. వెంటనే అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని సుమారు గంటన్నర పాటు శ్రమించి, సీటు కింద దాక్కున్న పామును జాగ్రత్తగా బయటికి తీసి పట్టుకున్నారు. దీంతో డ్రైవర్ ఊపిరి పీల్చుకున్నాడు. తన ప్రాణాలను కాపాడినందుకు అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపాడు.
అటవీ అధికారులు మాట్లాడుతూ.. వర్షాకాలంలో ఆశ్రయం కోసం పాములు వాహనాలు, ఇళ్లు, షెడ్లు వంటి ప్రదేశాల్లోకి తరచూ వస్తాయని, ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు ప్రశాంతంగా ఉండి వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..