VVS Laxman: క్రికెట్ ప్రపంచంలో ‘లార్డ్ ఆఫ్ ది ఫోర్త్ ఇన్నింగ్స్’ గా పేరు గాంచిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, తమ కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉండే లక్ష్మణ్, తరచూ ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. ఈసారి, శ్రీరామనవమికి ప్రసిద్ధి చెందిన భద్రాద్రి క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆయనకు ఒక గొప్ప అనుభూతినిచ్చింది.
శ్రీరాముడిని దర్శించుకోవడానికి వచ్చిన లక్ష్మణ్ కుటుంబానికి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలోకి ప్రవేశించిన వీవీఎస్ లక్ష్మణ్, ఆయన భార్యతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి మూలవిరాట్ అయిన సీత, లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిన అనంతరం, ఆలయ అర్చకులు వారికి శాలువాతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. వేదాశీర్వచనం కూడా అందించారు.
ఇవి కూడా చదవండి
ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ‘భద్రాచలంలో శ్రీరాముని దర్శనం దొరకడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీరాముడు, భక్త రామదాసుతో ముడిపడిన ఈ పుణ్యస్థలంలో నిలబడటం నిజంగా మరచిపోలేని అనుభూతి‘ అంటూ రాసుకొచ్చాడు.
Grateful for a blessed darshan at Bhadrachalam—the sacred land of Lord Rama. 🌸 Standing at this holy place, forever linked with the story of Lord Rama and Bhakta Ramadasu, was a truly humbling experience. 🙏💫 #JaiShriRam pic.twitter.com/PVDiMMfHWM
— VVS Laxman (@VVSLaxman281) September 21, 2025
ఈ సందర్భంగా, లక్ష్మణ్ భద్రాచలం ఆలయం పవిత్రత గురించి, దాని చరిత్ర గురించి అర్చకులతో మాట్లాడి తెలుసుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, శ్రీరాముడి ఆశీస్సులు తమ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన వీవీఎస్ లక్ష్మణ్, కేవలం ఒక క్రీడాకారుడుగానే కాకుండా, తన వినయ విధేయతలు, సంస్కారంతోనూ ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. క్రీడలతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ ఆధ్యాత్మిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన గొప్పతనాన్ని చాటుతుంది. భద్రాద్రి రాముడిని ఆయన దర్శించుకోవడం తెలుగు ప్రజలందరికీ ఒక సంతోషకరమైన వార్త.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..